Trump – Telsa car : ప్రముఖ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో భాగమైన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో.. అమెరికాతో పాటుగా అంతర్జాతీయంగా ఉన్న టెస్లా కార్లు, ఆస్తులపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. కొందరు.. కార్లను ధ్వంసం చేస్తుంటే, మరికొన్ని చోట్ల నిప్పు పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లా కార్లు, ఆస్తులపై దాడులు చేసే 20 ఏళ్లు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్న వారు, నిధులు సమకూర్చుతున్న వారి కోసం తాము ఎదురు చూస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ ద్వారా వ్యంగ్యంగా స్పందించారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. గత ఎన్నికల్లో ట్రంప్ నకు పూర్తి స్థాయి మద్ధతు తెలిపారు. ప్రచారంలోనూ పాల్గొని ఓట్లను రాబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యయ నియంత్రణ, సామర్థ్య పెంపు కోసం ఏర్పాటు చేసిన డోజ్ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా.. వివిధ విభాగాల్ని పూర్తిగా మూసేయడం, మరికొన్నింటిలో ఉద్యోగుల్ని భారీగా తొలగిస్తూ.. దేశంలో అనేక వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే అమెరికా వ్యాప్తంగా టెస్లా వాహనాలు తీవ్రమైన దాడుల్ని ఎదుర్కొంటున్నాయి.
అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాల్లోని టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతోపాటు కార్ల పైనా వివిధ రకాలుగా దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ లోగో ఉన్న ఆస్తులపై దాడులు విదేశాలలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలి దాడిలో, కెనడాలోని ఒక కార్ డీలర్‌షిప్‌లో దాదాపు 80 టెస్లా వాహనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అమెరికాలోని వివిధ ప్రాంతాలలో, టెస్లా సైబర్ ట్రక్కులను తగలబెట్టారు. బుల్లెట్లు, మోలోటోవ్ కాక్‌టెయిల్స్ లతో టెస్లా షోరూమ్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మస్క్ విధానాలతో విభేధిస్తున్న వారంతా.. ఉత్తర అమెరికా, యూరప్‌లలోని టెస్లా కార్యాలయాలు, కర్మాగారాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు అయితే.. ఏకంగా తమ దగ్గరున్న టెస్లా కార్లను విక్రయించేస్తామంటూ పోస్టులు పెడుతున్నారు.
లాస్ వెగాస్‌లోని టెస్లా సర్వీస్ సెంటర్‌లో కార్లను తగలబెట్టిన దుండగులు.. ఓ కారుపై జాత్యాంహకారి అంటూ రెడ్ కలర్ పెయింట్ చేశారు. ఇలా పెరిగిపోతున్న దాడులతో కెనడాలో నిర్వహించిన అంతర్జాతీయ వెహికిల్ ఎగ్జిబిషన్ నుంచి టెస్లా తప్పకుంది. అక్కడ తన ఉత్పాదనలను ప్రదర్శించేందుకు నిరాకరించింది. ఇలా పరిస్థితులు మరింతగా దిగజారుతున్న వేళ.. ట్రంపే స్వయంగా స్పందించారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారంటూ హెచ్చరించారు. ఈక్రమంలోనే తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
Also Read : Putin on Ukrainian Citizens : దేశ పౌరసత్వం తీసుకోండి, లేదంటే – ఉక్రెయిన్ పౌరులకు పుతిన్ అల్టిమేటం
మరోవైపు.. ఎన్నికల్లో గెలుపు దగ్గర నుంచి పరిపాలనలో తనకు మద్ధతుగా నిలుస్తున్న ఎలాన్ మస్క్ కు ట్రంప్ అన్ని రకాలుగా మద్ధతుగా నిలుస్తున్నారు. మస్క్ కు మాటిచ్చినట్లుగానే టెస్లా కారును కొనుగోలు చేశారు. వ్యక్తిగతంగా వినియోగించడంతో పాటుగా.. ఏకంగా వైట్ హౌస్ లో ఈ కార్లను వినియోగించేందుకు టెస్లా అధినేత ఏకంగా 5 కార్లను వైట్‌హౌస్‌కు తీసుకువచ్చారు. ఈ కార్ల ప్రత్యేకతల్ని ఎలాన్ మస్క్.. అధ్యక్షుడు ట్రంప్ నకు స్వయంగా వివరించారు. వాటిలో నుంచి ఎరుపురంగు కారు తనకు నచ్చిందంటూ.. ట్రంప్ ఎంచుకున్నారు.