Trump Putin China Tariff | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ముఖ్యంగా సుంకాల విధానం విషయంలో తాను తగ్గేదెలేదంటూ వ్యవహరిస్తున్నారు. కెనడా, మెక్సికోలపై 25 శాతం అదనపు టారీఫ్‌లు విధించాలని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ తాజాగా చైనాపై సుంకాల ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే చైనా మీద సుంకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిపారు, దీని వల్ల డ్రాగన్‌కు (చైనా) ఫిబ్రవరి భయం పట్టుకుంది.
ఫెంటనిల్ డ్రగ్‌పై సంచలన వ్యాఖ్యలు
‘‘ఫెంటనిల్ డ్రగ్‌ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో, కెనడాలకు తరలిస్తోందన్నది వాస్తవం. ఈ దృష్ట్యా, చైనాపై 10 శాతం అదనపు సుంకాలు విధించాలని అనుకుంటున్నాం. మా బృందంతో ఈ అంశంపై ఇప్పటికే చర్చలు జరిపాం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వీటిని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం,’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఒరాకిల్ సీటీవో ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్‌తో వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిన్‌పింగ్‌తో చర్చల ప్రస్తావన
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల జరిగిన సంభాషణను ప్రస్తావించిన ట్రంప్ టారిఫ్‌ల విషయమై ఆ సమయంలో పెద్దగా చర్చించలేదని చెప్పారు. ‘‘డ్రగ్స్ వ్యాపారం చేసే వారికి మరణశిక్ష విధించాలని జిన్‌పింగ్ అనుకుంటున్నారు. చైనాలో ఇది అమలులోకి వస్తే.. మెక్సికో, కెనడా తదితర దేశాలకు ఫెంటనిల్ సరఫరా నిలిచిపోతుంది. ఈ అంశంపై చైనా అధ్యక్షుడితో మరింత విస్తృతంగా చర్చించాలనుకుంటున్నా,’’ అని ట్రంప్ వివరించారు.
Also Read: అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు.. అంత ఈజీ కాదు
ట్రంప్ వాణిజ్య యుద్ధం.. కెనడా ఘాటైన స్పందన
కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ట్రంప్ నిర్ణయాలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కెనడా, మెక్సికోలపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తామనే ట్రంప్ ప్రకటనకు గట్టి ప్రతిస్పందన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డాలర్‌కి డాలర్ అనే నినాదాన్ని మద్దతు ఇస్తూ, అవసరమైతే ప్రతీకారం తీర్చుకుంటాం,’’ అని ట్రూడో హెచ్చరించారు.
కెనడాలోని ఆటోమొబైల్ పరిశ్రమ హబ్ ఒంటారియో గవర్నర్ అయిన డాగ్ ఫోర్డ్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ‘‘ట్రంప్ చర్యలతో వాణిజ్య యుద్ధం తప్పక జరుగుతుంది. కానీ, వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం,’’ అని ఫోర్డ్ పేర్కొన్నారు.
పుతన్ కు హెచ్చరిక
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో త్వరలో భేటీ అవుతానని ట్రంప్ ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఒకవేళ పుతిన్ చర్చలకు రాకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తానని చెప్పారు.
‘‘యుద్ధం అనేది అసలు మొదలు కాకూడదు. నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో ఇలాంటి సంక్షోభం అసలే రాదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తొలగించడమే నా ప్రాధాన్యత. కీవ్‌లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే, ఆంక్షలు విధిస్తాను. పుతిన్ ఒక తెలివైన వ్యక్తి. నాకు ఆయనతో బలమైన అవగాహన ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా,’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాపై వివరణ
‘‘ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో ఆయుధాల సరఫరా కొనసాగుతుందా?’’ అని ఓ విలేకరి అడగగా, ట్రంప్ స్పందిస్తూ, ‘‘ఈ విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నాం. శాంతి ఒప్పందం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) కూడా బలంగా కోరుకుంటున్నారు,’’ అని వ్యాఖ్యానించారు.