Trump Tariffs: ఆయన చెప్పేదొకటి.. చేసేది మరోకటి.. బయటికి మాట్లాడేది ఒకటి.. అంతరంగం మరోకటి.. ఇవన్నీ ఇంకేవరి గురించో కాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి అనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఎందుకీ మాట అనాల్సి వస్తోందంటే.. ట్రంప్ భారత్‌పై టారిఫ్ కత్తిని దూయడం వెనక కారణం రష్యా అని చెబుతున్నారు. కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది ఇప్పుడు లెటెస్ట్‌గా బయటికి వచ్చింది.. ఇంతకీ ఆ కారణాలేంటి? అసలు ట్రంప్ భారత్‌పై ఎందుకు రీవెంజ్ తీర్చుకుంటున్నారు?
భారత్‌పై ట్రంప్ ప్రత్యేక విద్వేషం
డొనాల్డ్ ట్రంప్.. అమెరికాకు ప్రస్తుత అధ్యక్షుడు. అంతేకాదు ప్రపంచ దేశాలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.. టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్నారు.. తమ ఆధిపత్యాన్ని అంగీకరించాలంటున్నారు.. డాలర్ పెత్తనమే నడవాలంటున్నారు.. ఇవన్నీ ఒకెత్తు అయితే.. భారత్‌పై ప్రత్యేక విద్వేషాన్ని చూపిస్తున్నారు ట్రంప్.. భారత్‌పై టారిఫ్‌ల భారాన్ని మోపారు.. ఎలాంటి చర్చలు జరపడం లేదు.. తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్‌లో అన్ని అబద్ధాలు చెబుతూ నోటికి వచ్చింది రాస్తున్నారు.. అయితే బెదిరింపు.. లేదంటే టారిఫ్ మోతలు.. మొత్తానికి భారత్-అమెరికా మధ్య ఉన్న సంబంధాలను సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ చేశారు ట్రంప్. మరి వీటన్నింటికి ఆయన చెబుతున్న రీజన్ రష్యా నుంచి భారత్ చమురును కొనుగోళ్లు చేయడమే అంటున్నారు. అంతేకాదు ఈ కొనుగోళ్ల వల్లనే రష్యా ఇంకా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తుందని చెబుతున్నారు. మరి ఇవన్నీ నిజాలేనా?
ఏమాత్రం నమ్మబుల్‌గా లేని ట్రంప్ ఆరోపణలు
ట్రంప్ ఇప్పుడు ఒకే పనిలో ఉన్నారు.. అదేంటంటే భారత్ వల్లనే రష్యా పెట్రేగిపోతుందని ప్రపంచాన్ని కన్విన్స్ చేయడం. కానీ ఇప్పుడీ మాటలను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ నిజ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు భారత్ బయటపెడుతోంది. అది కూడా కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే రీతిలో ముందుకు పోతుంది భారత్. సరే.. ఇప్పుడు ట్రంప్ రీవెంజ్‌కు అసలు కారణం చెప్పుకుందాం. అమెరికా అధ్యక్ష బరిలో గెలిచి పదవి చేపట్టినప్పటి నుంచి అమెరికాను తిరిగి గ్రేట్‌గా చేయాలనే దానిపై ఎంత వరకు పనిచేశారో తెలీదు కానీ.. తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలి అనే విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ముందుకు వెళ్లారు. దీని కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ముందుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు. దీని కోసం రష్యాతో చర్చలు జరుపుతానంటూ.. ఉక్రెయిన్‌కు అందే సైనిక సాయాన్ని దాదాపుగా నిలిపివేశాడు. మరోవైపు రష్యా ప్రతినిధులతో.. పలు వేదికల్లో అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు. కానీ ఏ ఒక్కటి కూడా అడుగు ముందుకు పడలేదు. ఇంతలో తాను యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాను.. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం అంగీకరించడం లేదనే పాట ఎత్తుకున్నారు. కొన్నాళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. చివరికి యుద్ధాన్ని ఆపాను అనే క్రెడిట్ తనకు రాలేదు.
మరోసారి శాంతి దూతగా అవతారం ఎత్తాలనే ప్రయత్నం
ఇలాంటి సమయంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సంబంధం లేకున్నా.. భారత్‌కు నచ్చదని తెలిసినా ఈ వ్యవహారంలో వేలు పెట్టారు. మరోసారి శాంతి దూతగా అవతారం ఎత్తాలని చూశారు. నిజానికి ఆయన చేసిన పని చేసి ప్రతిఫలం ఆశిస్తే బాగుండేది.. కానీ ఏం చేయకుండానే అంతా తానే చేశానని ప్రచారం మొదలుపెట్టారు. మరి నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఓ వైపు అలాంటిదేం లేదని భారత్ ఖండిస్తున్నా.. కనీసం పట్టించుకోలేదు. చివరికి మోడీతో చివరిసారి మాట్లాడినప్పుడు కూడా తనను నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయాలని.. ఇప్పటికే పాకిస్థాన్ ఆ పని చేసిందని తెలిపారు. కానీ ట్రంప్ పాచికలు మోడీ ముందు పారలేదు. దీంతో అహం దెబ్బతిన్న ట్రంప్ ఇకపై భారత్‌పై కత్తులు నూరడం ప్రారంభమైంది.
నిజంగా రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోళ్లే టారిఫ్‌లకు కారణమైతే.. ముందుగా చైనాపై విధించాలి. ఎందుకంటే చైనా మనకంటే ఎక్కువ చమురును కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై ఈ టారిఫ్‌లు విధించలేదు. ఇక ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ను ఈయూ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. కానీ ఆ దేశాల జోలికి వెళ్లడం లేదు ట్రంప్. కేవలం భారత్‌పై మాత్రమే ఈ టారిఫ్ కత్తిని దూయడమే కాదు.. మాటల దాడిని పెంచారు. అంతేకాదు ఈ నోబెల్ ప్రైజ్ మనీ వివాదం కూడా నిజమే అని ధ్రువీకరించేలా కొన్ని ఘటనలు జరిగాయి.
భారత్ కంటే ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్న చైనా
చివరిసారిగా జున్ 17న మోడీతో ఫోన్ కాల్‌లో మాట్లాడారు ట్రంప్. అప్పుడే నోబెల్ శాంతి బహుమతి అంశం చర్చకు వచ్చింది. ఇక మోడీ ముందు తన పాచికలు పారకపోవడంతో.. మరోవైపు నుంచి నరుక్కుంటూ రావాలన్న ఆలోచనతో పాక్‌ను నెత్తికెక్కించుకోవడం ప్రారంభించారు. పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో భేటీలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కూడా అనేక ఎత్తులు వేశారు ట్రంప్. జూన్‌లో మోడీ జీ7 సమావేశాల కోసం కెనడాకు వెళ్లారు. ఆ తర్వాత మోడీని అమెరికాకు రావాలని ఆహ్వానించారు. క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉందని.. సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. కానీ ట్రంప్ అసలు వ్యూహం ఏంటంటే.. అప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో ఉన్నారు. మోడీని కూడా వైట్ హౌజ్‌కు ఇన్వైట్ చేసి ఇద్దరితో ఫోటో దిగాలనేది ట్రంప్ ఆలోచన. ఈ విషయం ముందే గమనించి ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు మోడీ.
నాలుగు సార్లు మోడీతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించిన ట్రంప్
ఓ వైపు ఇలా అన్ని పనులు చేస్తూనే మోడీతో ఫోన్‌లో మాట్లాడెందుకు ప్రయత్నించారు ట్రంప్. నాలుగు సార్లు ఇలా ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. కనీసం పట్టించుకోలేదు మోడీ. నిజానికి ఈ చర్యలతో భారత్ దారికి వస్తుందనేది ట్రంప్ ఆలోచన. కానీ దారికి రావడం అటుంచి అమెరికాను ఖాతరు చేయలేదు భారత్. దీంతో ఇక తన అమ్ములపొదిలోని ఆఖరిది.. బ్రహ్మాస్తమైన టారిఫ్‌లను ప్రయోగించేశారు. నిజానికి ఈ విషయాలను మొదట ఓ జర్మన్ పత్రిక బయటపెట్టగా.. రీసెంట్‌గా న్యూయార్క్ టైమ్స్‌కు కూడా ధ్రువీకరించింది. దీంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ట్రంప్‌ది. ఎందుకంటే ఇండియాను భారత్‌కు తెచ్చుకోవాలన్న ఆత్రంలో చేసిన పనులు ఫలితమివ్వకపోగా.. ఎదురుతన్నాయి. దీనికి తోడు ట్రంప్‌ను భారత్ పట్టించుకోవడం లేదనే వార్త ఇప్పుడు జియో పాలిటిక్స్‌లో ఓ సెన్సేషన్. ఇప్పుడు వీటిని కౌంటర్ చేయాలంటే ప్రయోగించడానికి మరే అస్త్రం కూడా అమెరికా వద్ద లేదు. ఒకవేళ ప్రయోగించినా.. దానిని ఎదుర్కోనేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది.
నష్టం చేసిన ట్రంప్ నోటిదురుసు.. సోషల్ మీడియా కామెంట్స్
నిజానికి ట్రంప్ ఓవరాక్షన్ చేయకుండా ఉంటే ఈ వివాదం ఇప్పటికే సద్దుమణిగేది. కానీ నోటిదురుసు.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య దూరాన్ని అగాథంగా మార్చింది. చర్చించేది ఒకటి.. ట్రంప్ బయటికి చెప్పేది మరోకటి.. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడినా.. ట్రంప్ దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందనేది బారత్ ఆలోచన. అందుకే ట్రంప్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మేలనే ఆలోచన మోడీ సర్కార్‌ది. ఏం చేసినా.. ఏం చర్చించినా.. ఓపెన్‌గా చర్చలు జరగాలనే ఆలోచనలో ఉంది.
. నిజానికి భారత్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణం.. ట్రంప్..
. రష్యా-భారత్ మధ్య ఉన్న దోస్తీ.. మరింత మెరుగువ్వడానికి కారణం .. ట్రంప్..
. చిరకాలంగా శత్రువుగా ఉన్న చైనా.. భారత్‌కు చేరువవుతుండానికి కారణం .. ట్రంప్..
. బ్రిక్స్ దేశాలు ఏకమవ్వడానికి కారణం.. ట్రంప్..
. డాలర్ పెత్తనానికి ఎండ్ కార్డ్ పడేందుకు.. బ్రిక్స్ దేశాలు అడుగు వేయడానికి కారణం.. ట్రంప్..
. పశ్చిమ దేశాల్లో ఓ అలజడికి కారణం.. ట్రంప్..
. యూరోపియన్ యూనియన్‌లో కాస్త చీలికలు రావడానికి కారణం.. ట్రంప్..
. అమెరికాపై ప్రపంచదేశాల అనుమానపు చూపులు పెరగడానికి కారణం.. ట్రంప్..
. అమెరికా అధిపత్యం ఇంకెన్నాళ్లు అనే ప్రశ్నలు లెవనెత్తడానికి కారణం.. ట్రంప్..
. ఇలా అమెరికా వెనకడుగు వేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు ట్రంప్.
. అసలు ట్రంప్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఆ నోబెల్ శాంతి బహుమతేనా?
. ఇంతకి ట్రంప్‌కు ఈ ప్రైజ్ పిచ్చి ఎందుకు పట్టుకుంది? భారత్ ట్రంప్ టారిఫ్‌లను ఎలా ఎదుర్కోంటోంది?
ఆస్తి ఉంది.. పదవి ఉంది.. పరపతి ఉంది.. కానీ ట్రంప్‌కు ఇప్పుడు లేనిది ఒక్కటే.. అదే నోబెల్ శాంతి బహుమతి.. ఈ అవార్డ్ ఇప్పుడు ట్రంప్‌కు ఇప్పుడో అందని ద్రాక్షగా మారింది.. పదవిలో ఉన్నప్పుడే సంపాదించుకోకపోతే ఇక జీవితంలో ఇక కుదరదన్న భయం ఇప్పుడు ట్రంప్‌లో కనిపిస్తోందనే చర్చ ఉంది. అందుకే తన మాట వినని దేశాలపై ఇలా ట్రంప్ తన టారిఫ్ కత్తిని జులిపిస్తున్నారనే చర్చ ఉంది. అసలు ట్రంప్‌కు ఈ నోబెల్ ప్రైజ్‌పై ఇంత పిచ్చి ఎందుకు?
నాకు 10 నోబెల్ బహుమతులు రావాలన్న ట్రంప్
విన్నారుగా.. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అప్పుడు అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏం సాధించారని ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు.. అలాగైతే నాకు 10 నోబెల్ బహుమతులు రావాలి.. ఇది ఆయన మనసులోని మాట. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. అనేక సార్లు నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆఖరికి అధ్యక్షుడయ్యాక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. చివరికి ట్రంప్ తానే స్వయంగా నోబెల్‌కు నామినేషన్లు పంపిస్తూ ఓ చిన్నపాటి దండయాత్ర చేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా ఆయన నామినేషన్‌ను తీసుకోలేదు కమిటీ. తొలిసారి 2018లో ట్రంప్ పేరును ప్రతిపాదించారు 18 మంది రిపబ్లికన్ సభ్యులు. నార్త్ కొరియా, యూఎస్ మధ్య చర్చలు నిర్వహించారని కారణంగా చూపారు. రిజెక్ట్ అయ్యింది.. 2020లో మరోసారి నామినేట్ చేశారు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలు చేయించారని కారణంగా చూపారు. మళ్లీ రిజెక్ట్ అయ్యింది. ఇక 2024లో మరోసారి నామినేట్ చేశారు. కాని రిజల్ట్‌లో మాత్రం ఏమాత్రం తేడాలేదు.
ఇతర దేశాలను రిక్వెస్ట్ చేసి మరి పేరు నామినేట్
ఇక అధ్యక్షుడయ్యాక దీనిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆయనే ఇతర దేశాలను రిక్వెస్ట్ చేసి మరి తన పేరును నామినేట్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ట్రంప్ ఆయన పేరును నామినేట్ చేశారు. చివరికి మోడీని కూడా తన పేరును నామినేట్ చేయాలని కోరారు. నిజానికి ఏం చేశారని నామినేట్ చేయాలనే ప్రశ్న ఎదురవ్వడంతో సైలెంట్ అయ్యారు. ఓ వైపు ట్రంప్ ఇలా అందరిని అభ్యర్థించే పనిలో ఉండగా.. మరోవైపు ఆయనకు తగ్గట్టుగా వైట్‌హౌజ్ కార్యవర్గం తమ పని చేస్తోంది. థాయ్‌లాండ్ -కంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, రవాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా, భారత్-పాక్ మధ్య సంధి కుదర్చింది ట్రంప్ అంటూ ఊదరగొడుతోంది. నిజానికి థాయ్-కంబోడియా మధ్య సయోధ్యను కుదర్చింది మలేషియా.. భారత్-పాక్ మధ్య DGMO స్థాయి చర్చలతో ఉద్రిక్తతలు ఆగాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై దాడులు చేసింది తామే అని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇందులో శాంతి ఎక్కడుందో ఆయనకే తెలియాలి.
ఇరాన్‌పై అయితే బంకర్ బస్టర్లతో అమెరికా దాడులు
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ట్రంప్ అధికారం చేపట్టిన తొలి ఆరరు నెలల్లో ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్య ఆసియాలోని 240 ప్రాంతాల్లో 529 దాడులు జరిపింది అమెరికన్ ఆర్మీ. ఇక ఇరాన్‌పై అయితే బంకర్ బస్టర్లను వాడేశారు. అక్కడితో ఆగలేదు ట్రంప్ పనితనం.. ఏకంగా అంతర్జాతీయ సాయాన్ని నిలిపివేశారు. ఇన్నీ చేసి తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి.. జెలెన్ స్కీతో అమెరికాకు అనుకూలంగా ఉండే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. ఇందులో మానవాత సాయం ఏముందనేది అసలు ప్రశ్న.
భారత్ పై టారిఫ్‌లు విధించాలని ఈయూ దేశాలపై ఒత్తిడి
ఓ వైపు ఇన్ని అరాచకాలు చేస్తూ.. వ్యూహాలు రచిస్తూ తన పేరును నామినేట్ చేయాలంటూ భారత్‌తో మంతనాలు జరిపారు ట్రంప్. ఆయన తీరును.. టెంపరితనాన్ని చూస్తూ ఉన్న భారత్ సున్నితంగా తిరస్కరించింది. ఇదే ఇప్పుడు ట్రంప్ ఈగోను దెబ్బతీసింది. దీంతో ఏం చేసినా భరించి.. దారికొస్తుందన్న నమ్మకంతో భారత్‌పై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించారు. అంతేకాదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఓ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈయూ కూడా భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుపుతోంది ట్రంప్ కార్యవర్గం.
కొత్త మార్కెట్‌ను అన్వేషించడం ఇప్పటికే ప్రారంభం
కానీ ఇక్కడో మరో కీలక విషయాన్ని ట్రంప్ దాచి పెడుతూ వస్తున్నారు. అదేంటంటే.. ఉక్రెయిన్‌కు అత్యధికంగా డీజిల్ సరఫరా దేశం భారత్. ఈ సరఫరానే ఇప్పుడు ఉక్రెయిన్ జీవనాడి అని చెప్పవచ్చు. మరి ఉక్రెయిన్‌కు ఈ డీజిల్‌ను భారత్ ఎలా సరఫరా చేస్తోంది అంటే.. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును ప్రాసెస్ చేసి ఉక్రెయిన్‌కు ఎగుమతి చేస్తోంది. మరి తమకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఉక్రెయిన్‌కు తెలియదా? భారత్, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వ్యాపారం అమెరికాకు తెలియదా? మరి అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌పై ఎందుకు టారిఫ్‌లు విధించడం లేదు? దీనికి మాత్రం ట్రంప్, అతని కార్యవర్గం నోరు తెరవదు.
Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!
నిజానికి పైన పిట్టను చూపించి.. కింద మసాలా నూరాలని చూస్తున్నారు ట్రంప్. ఇవి ఇతర దేశాలపై పనిచేస్తాయెమో కానీ తమపై కాదంటోంది భారత్. అయితే ట్రంప్ టారిఫ్‌లతో భారత్‌కు మాత్రం నష్టాలు తప్పవు. కానీ వాటిని భరిస్తూ.. కొత్త మార్కెట్‌ను అన్వేషించడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జపాన్‌తో పాటు అనేక ఆసియా, ఈయూ దేశాలతో పాటు చైనాతో పాటు కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ట్రంప్ పుణ్యమా అని భారత్ మేల్కోంది అనేది మాత్రం నిజం.
Story By vamshi Krishna, Bigtv