Trump UK Court| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. బ్రిటన్ న్యాయస్థానంలో ఉహించని షాక్ ఎదుర్కొన్నారు. బ్రిటన్ దేశ మాజీ గూఢచారి క్రిస్టోఫర్ స్టీల్‌పై ట్రంప్ గతంలో వేసిన దావా కేసులో లండన్ హైకోర్టు.. ఎదురుగా ట్రంప్‌పైనే భారీ జరిమానా విధించింది. ఈ కేసులో ట్రంప్.. తాను చేసిన ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల రూపంలో ఆయన 7,41,000 డాలర్లు (దాదాపు రూ.6 కోట్లు) చెల్లించాలని తీర్పు చెప్పింది.
2017లో బ్రిటన్ గూఢాచారి క్రిస్టోఫర్ స్టీల్.. ట్రంప్‌పై “స్టీల్ డోజియర్” పేరుతో ఒక సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో రష్యా ఏజెంట్లతో ట్రంప్ అనుచిత సంబంధాలు కలిగి ఉన్నారని.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రష్యా నుంచి ఆయనకు మద్దతు లభించిందని ఆరోపణలు ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించాడని కూడా ఈ పత్రంలో బ్రిటన్ గూఢాచారి పేర్కొన్నారు.
ట్రంప్ ఈ ఆరోపణలపై లండన్ కోర్టులో క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను నిర్ధారించడంలో విఫలమవడంతో కోర్టు ట్రంప్‌నకు జరిమానా విధించింది. 6,25,000 యూరోలు అంటే అమెరికా కరెన్సీలో 7,41,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.
Also Read: ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులు.. తిండి లేదు, తీవ్ర చలి, ఒక్కటే టాయిలెట్
మరోవైపు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా జోక్యం ఉన్నదా అనే అంశంపై యుఎస్ స్పెషల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు చేసి, రష్యా జోక్యం ఉన్నట్టు తేల్చారు. అయితే ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
యెమెన్ యుద్ధ ప్రణాళిక లీక్: సిగ్నల్ యాప్‌పై అమెరికాలో దర్యాప్తు
అమెరికా రక్షణ శాఖలో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. యెమెన్‌పై దాడి ప్రణాళికలు లీక్ అవడంతో పెంటగాన్ సిగ్నల్ యాప్ వినియోగంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ సమాచారం లీక్ విషయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ఆరోపణలు ఎదురవుతున్నాయి.
పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ స్టీవెన్ స్టెబిన్స్ ఈ దర్యాప్తు గురించి ప్రకటించారు. హెగ్సెత్ సిగ్నల్ యాప్‌ను అధికారిక చర్చల కోసం ఉపయోగించడం రక్షణ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా అని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఇలాంటి కమర్షియల్ యాప్‌లను అధికార సంభాషణల కోసం వినియోగించడం శ్రేయస్కరమేనా అనే అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు.
యెమెన్‌లో హూతీ రెబల్స్‌పై దాడి ప్రణాళికలను సిద్ధం చేస్తూ, అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి 19 మంది సిగ్నల్ యాప్‌లో చర్చలు జరిపారు.
ఈ చాట్ గ్రూప్‌లో పొరబాటున అట్లాంటిక్ ఎడిటర్ జెఫ్రీ గోల్డ్‌బెర్గ్ కూడా చేర్చబడ్డారు. మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా ఒక వారం తర్వాత అదృశ్యమయ్యేలా సెట్టింగ్స్ మార్చబడ్డాయి. అయితే, ఈ గ్రూప్ చాటింగ్ స్క్రీన్‌షాట్లు బహిర్గతం కావడంతో దర్యాప్తు ప్రారంభమైంది.
ఆ స్క్రీన్‌షాట్లలో అమెరికా దాడి ప్రణాళికలు, లక్ష్యాలు, ఆయుధాల మోహరింపు, దాడి దిశ వంటి అంశాలు స్పష్టంగా కనిపించాయి. దాడులు విజయవంతంగా జరిపినప్పటికీ, జేడీ వాన్స్ ఈ చర్యలను వ్యతిరేకించినట్లు తేలింది.
ఇప్పుడు ఈ లీక్ కారణంగా సిగ్నల్ యాప్ వినియోగంపై అమెరికా రక్షణ శాఖ లోతైన దర్యాప్తు జరుపుతోంది.