China Solar panel wall : దేశంలోని ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న చైనా.. మరో భారీ ప్రాజెక్టుతో తన ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే.. అనేక రకాల వినూత్న ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తున్న చైనా.. అక్కడ విశాలమైన ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారభించింది. అందులో భాగంగా..అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు మీకు చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు.. కానీ ఇప్పుడు మీకు గ్రేట్ సోలార్ వాల్ చూపిస్తామంటూ అక్కడి యంత్రాంగం చెబుతోంది. ఇంతకీ.. ఈ ప్రాజెక్టు విషయం ఎప్పుడు బయటకు వచ్చింది. ఎంత పెద్దగా ఈ ప్రాజెక్టును చేపట్టారో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.
పెద్దది అంటే మాటలు కాదు.. ఈ ప్రాజెక్టు ఏకంగా 400 కిలో మీటర్ల పొడవు, 5 కిలీ మీటర్ల వెడల్పుతో ఉండనుంది. ఇప్పటికే.. ఈ ప్రాజెక్టులోని చాలా భాగాల్ని పూర్తి చేసిన చైనా, 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ఇన్నర్ మంగోలియాలోని కబుకీ ఎడారిలో(Kubuqi Desert) చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.
విశాలమైన ఎడారి ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యి విద్యుత్ తో బీజింగ్(Beijing) అవసరాలు పూర్తిగా తీరేలా నిర్మిస్తున్నారు. ఈ పూర్తి ప్రాజెక్టులో ఇప్పటి వరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానల్స్‌ను అమర్చినట్లు చైనా అధికారులు వెల్లడించారు. మిగతా ప్యానళ్ల నిర్మాణాన్ని శరవేగంగా నిర్మిస్తుండగా.. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీని భారీగా ఉత్పత్తి చేయాలని చైనా భావిస్తోంది.
వాస్తవానికిి ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోయింది. క్రమంగా ఈ ఎడారి ప్రాంతం విస్తరిస్తూ వెళుతుండగా.. దీని విస్తరణను నిరోధించాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎడారి ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్ గా అభివర్ణిస్తుంటారు. అలాంటి చోట విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చూస్తోంది.
ఈ ప్రాజెక్టును ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచింది. కాగా.. ఇటీవల ఈ ప్రాంతం మీద నుంచి వెళ్లిన నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఇక్కడి నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసింది. నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 8, 9 ఉపగ్రహాలు ఇక్కడి నిర్మాణాల్ని చిత్రీకరించగా.. వీటిలో డిసెంబర్ 2017-2024 మధ్య చిత్రాల్ని పోల్చి చూడగా అక్కడి నిర్మాణాల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది.
ఎడారీకరణ కారణంగా సీ ఆఫ్ డెత్ గా మారిన ప్రాంతాన్ని చైనా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవాల్టిక్ సముద్రంగా మార్చేసిందంటూ నాసా ఎర్త్ అబ్జర్వేటరీ వ్యాఖ్యానించింది. అయితే.. కబుకీ ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండటం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు ఈ ప్రాంతాన్ని అనువుగా మార్చాయంటున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టులోని ప్యానెళ్లను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మించారు. దీనిని జున్మా సోలార్ పవర్ స్టేషన్ గా పిలుస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానల్స్ ఇమేజ్‌గా.. ఇక్కడి పరిగెత్తే గుర్రం రికార్డు సృష్టించింది.
Also Read : ఇంటికి కిటికీలు పెట్టకండి.. పెట్టారో నేరుగా జైలుకే అంటున్న ప్రభుత్వం.. ఎందుకంటే..
సోలార్ పవర్ ఉత్పత్తిలో చైనా శరవేగంగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు దేశంలోని అన్ని ప్రాజెక్టుల నుంచి చైనా 3,86,875 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత స్థానంలో అమెరికా 79,364 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. కాగా.. చైనా ఉత్పత్తి చేస్తోన్న మొత్తం సోలార్ విద్యుత్.. ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తున్న సోలార్ పవర్ సామర్థ్యంలో సగానికి సమానం కావడం విశేషం.