Taliban on Women : వంట గదులకు కిటకీలు ఉంటే.. అక్కడ వంట చేసే మహిళలు బయటకు కనిపిస్తున్నారు. అలా కనిపించడం తప్పు.. కాబట్టి వంట గదులకు కిటికీలను తీసేయండి. వాళ్లు బయటకు కనిపించేందుకు వీలు లేదు. ఇదీ.. ఆ దేశంలో కొత్త అమల్లోకి వచ్చిన నిబంధన. ఇలాంటి నిబంధన ఎక్కడైనా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇదేం పెద్ద విషయం కాదు… ఇంతకంటే ఇంకా దారుణమైన నిబంధనలు అమలవుతున్నాయి ఆ దేశంలో. ఎక్కడ అనుకుంటున్నారా.. తాలిబన్ల రాజ్యమైన అప్ఘనిస్థాన్ లో.
తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు బహిరంగ నరకాన్ని అనుభవిస్తున్నారు. నిత్యం కొత్త కొత్త నిబంధనలు, ఆంక్షలతో వారి జీవితాల్ని దారుణంగా మార్చేస్తున్నారు. సామాజిక విషయాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు అనేక విధాలుగా మహిళల్ని హింసిస్తున్న తాలిబన్ నేతలు.. ఇప్పుడు ఏకంగా కొత్తగా నిర్మించే ఇళ్లల్లో వంట గదులకు కిటికీలు వద్దని డిక్రీ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ఇస్లామిక్ తీవ్రవాదులు చేతుల్లో చిక్కినప్పటి నుంచి అప్ఘనిస్థాన్ లో అనేక క్రూరమైన, దారుణమైన నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే.. బాలికలు, మహిళల విద్యను పూర్తిగా నిషేధించగా.. ఆదేశం టీవీ ప్రసారాలు, మ్యూజిక్ వినటం వంటివి పూర్తిగా నేరపూరిత అంశాలు. తమ సిద్దాంతాల ప్రకారం.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ అనేక అంశాల్లో మహిళల్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వంట గదుల్లో నుంచి సైతం మహిళలు బయటకు కనిపించకూడదు అనే నిబంధన వారి చర్యలకు పరాకాష్టగా మారిపోయింది.
అంతే కాదు.. ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటికి కనిపించేందుకు వీలు లేదని తాలిబన్లు నిషేధాజ్ఞలు జారీ చేశారు. మహిళలు, యువతులు బయటకు కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు అవకాశం ఉందని.. కాబట్టి వారిపై అత్యాచారాలు, నేరాలు జరగకుండా ఉండాలంటే వారిని కనిపించకుండా చేయాలని ఆదేశించారు. ఇంటి చుట్టూ ఎత్తైన ప్రహరీలు నిర్మించి ఆడవాళ్లను కనిపడనివ్వకుండా చేయాలని ఆదేశించారు. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
తాలిబన్ల కొత్త ఆంక్షలతో ఇకపై చేపట్టే నిర్మాణాలను మున్సిపల్ అధికారులు పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు. మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్ ప్రభుత్వం.. అనేక తీరులుగా మహిళల్ని ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే.. అక్కడ జిమ్ లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశం నిషేధం.
Also Read : ఆ దేశాల్లో వండర్.. అప్పుడే న్యూ ఇయర్ కూడా కంప్లీట్.. ఇదో వెరైటీనే!
అప్ఘనిస్థాన్ లో ఎవరైనా మహిళలు బయటకు రావాలంటే వారింట్లో మగవారి నుంచి అనుమతి తప్పనిసరి. అలాగే.. బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా మగవారు తోడు ఉండాల్సిందే. లేదంటే.. ఆ మహిళలపై షరియా ప్రకారం శిక్ష విధిస్తారు. దాంతో పాటే.. ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచేలా బట్టలు ధరించాల్సి ఉంటుంది. కాలి పాదాలు, చేతి వేళ్లు బయటకు కనిపించినా అక్కడ నేరమే. ఆఖరికి.. బురఖా ధరించిన మహిళలు.. కళ్ల దగ్గర జాలిలాంటి గుడ్డను అడ్డుగా పెట్టుకోవాలి. లేదంటే.. వారికి బహిరంగ ప్రదేశాల్లోనే కొరడా శిక్షలు అమలు చేస్తారు. ఇలాంటి నిబంధన మధ్య తాజాగా.. ఇంటికి కిటికీలు సైతం ఉండవద్దనే షరతు.. వారిని నిత్య నరకం వంటిదే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.