US Attacks on Houthi : అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై దాడులు చేస్తున్న హౌతీ తిరుగుబాటు దారులపై కొన్ని రోజులుగా దాడులు చేస్తున్న అమెరికా తాజాగా.. యెమెన్‌లోని హొడైదా నగరంలోని విమానాశ్రయంపై దాడులు చేసింది. యెమెన్ ఉత్తర ప్రావిన్స్ సాదాలోని సహార్, కితాఫ్ ప్రాంతలపై అమెకన్ దళాలు బాంబు దాడులు నిర్వహించాయి. సెంట్రల్ ప్రావిన్స్ మారిబ్‌పై.. ఐదు సార్లు వైమానికి దాడులు చేశాయి.
ఓ వైపు వైమానిక దాడుల సమాచారం తెలుస్తుండగానే.. యూఎస్ యుద్ధ విమానాలు ఎల్ హొడైదా ఎయిర్పోర్టుపై దాడులకు దిగాయి. ఇక్కడి ఇస్లాం ఉగ్రవాదులకు సంబంధించిన క్షిపణి, డ్రోన్ నిల్వ సౌకర్యాలు, లాంచింగ్ పాడ్ లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో హౌతీ నావికా దళాల కమాండర్ మన్సూర్ అల్-సాది గాయపడినట్లుగా సమాచారం అందింది. అలాగే.. ఆల్-కథిబ్ ప్రాంతంలోని నావికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను తట్టుకునేందుకు పశ్చిమాసియాకు రెండవ విమాన వాహక నౌకను అమెరికా పంపుతోంది. అదనంగా, ప్రస్తుతం ఎర్ర సముద్రంలో పనిచేస్తున్న USS హ్యారీ ఎస్ ట్రూమాన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మరో నెల రోజుల పాటు అక్కడే మోహరించాల్సిందిగా.. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఆదేశించారు. రాబోయే వారాల్లో USS కార్ల్ విన్సన్, దానితో పాటు వచ్చే డిస్ట్రాయర్లు ఎస్కార్ట్‌లుగా ఈ ప్రాంతంలో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తాయని అమెరికా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం.. విమాన వాహక నౌక కార్ల్ విన్సన్ జపాన్, దక్షిణ కొరియన్లతో కలిసి తూర్పు చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను ముగించే వరకు హౌతీ తిరుగుబాటు దారులపై దాడులు కొనసాగుతాయని ట్రంప్ యంత్రాంగం స్పషం చేసింది. మార్చి 15న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులపై నిర్ణయాత్మకమైన, శక్తివంతమైన సైనిక చర్య ప్రారంభించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వారిపై ఉదాసీనంగా ఉన్నందునే హౌతీలు అమెరికాపై దాడి చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
హౌతీలను పూర్తిగా నిర్మూలించాలిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వారు చేసేది న్యాయమైన పోరాటం కాదని, వారి లక్ష్యం ఎప్పటికీ నెరవేరదని ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలోే.. హౌతీ కీలక నాయకులు, క్షిపణి నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని..యెమెన్‌లోని 30 కి పైగా లక్ష్యాలపై అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు భారీ ఎత్తున దాడులు నిర్వహించాయి.
బుధవారం నాడు పశ్చిమ ప్రావిన్స్ అల్-జాఫ్‌ను, గురువారం తెల్లవారుజామున హొదిదా, సాదాలో అమెరికా దళాలు దాడులు నిర్వహించాయి. యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీలపై తమ దళాలు 24/7 నిఘా కొనసాగిస్తాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. కాగా.. 2023 నుంచి హౌతీ ఉగ్రవాదులు US యుద్ధనౌకలపై 170 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు క్షిపణులు, వన్-వే అటాక్ డ్రోన్‌లను ప్రయోగించారు.
Also Read : Trump Biden Security Clearance : బైడెన్ పై పగ తీర్చుకున్న ట్రంప్.. మాజీ ప్రెసిడెంట్‌కు ఆ సేవలు రద్దు
యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పెంటగాన్ సైనిక చర్యపై జాయింట్ స్టాఫ్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రిన్‌కెవిచ్ స్పందించారు. యొమెన్ లోని 30 కి పైగా లక్ష్యాలపై దాడులు నిర్వహించగా.. వివిధ రకాల హౌతీ సామర్థ్యాలు దిగజారిపోయాయని తెలిపారు. అలాగే.. ఉగ్రవాద శిక్షణా ప్రదేశాలు, మానవరహిత వైమానిక వాహన మౌలిక సదుపాయాలు, ఆయుధాల తయారీ సామర్థ్యాలు, ఆయుధాల నిల్వ సౌకర్యాలపై దాడులు చేస్తున్నట్లు గ్రిన్‌కెవిచ్ తెలిపారు.