US Deportation : అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… దేశంలోని చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని తిరిగి పంపించేందుకు సైనిక విమానాలు వినియోగిస్తున్న విషయం తెలసిందే. అయితే.. ఆ విమానాల్లో తరలింపు కారణంగా భారీగా ఖర్చు అవుతుండడంతో.. ఇకపై వలసదారుల్ని తిప్పి పంపేందుకు భారీ సైనిక విమానాల్ని వినియోగించకూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గతంలో షెడ్యూల్ చేసిన విమానాల్లో చివరి సైనిక రవాణా విమానాన్ని మార్చి 1న పంపించగా.. మళ్లీ ఇప్పటి వరకు మరో సైనిక విమానాన్ని షెడ్యూల్ చేయలేదని అధికారులు తెలిపారు.
ఓ వైపు ప్రభుత్వంలోని అనవసర ఖర్చుల్ని తగ్గించేందుకు టెస్లా అధినేత మస్క్ నేతృత్వంలో డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ నిధుల వినియోగాన్ని తగ్గిస్తున్న ట్రంప్.. సైనిక విమానాలను వినియోగించడం ద్వారా భారీగా ఖర్చు చేశారు. ఒక్కో సైనిక విమానం వెళ్లి వచ్చేందుకు వేలు, లక్షల డాలర్లు ఖర్చవుతుండడంతో.. ఉన్నతాధికారులు భారీ సైనిక విమానాల వినియోగానికి విముఖుత చూపిస్తున్నారంట. అందుకే.. అక్రమ వలసదారుల్ని తిప్పి పంపేందుకు మరే సైనిక విమానాన్ని షెడ్యూల్ చేయలేదని చెబుతున్నారు.
జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే అమెరికా కొంతమంది వలసదారులను వారి స్వదేశాలకు లేదంటే గ్వాంటనామో బేలోని సైనిక స్థావరానికి తరలించారు. ఇందుకోసం.. పెద్ద ఎత్తున సైనిక విమానాల్ని వినియోగించారు. వారిని సాధారణ విమానాల్లోనూ తిప్పి పంపేందుకు అవకాశం ఉన్నా కూడా సైనిక విమానాల ద్వారానే తిప్పి పంపించారు. దీని వల్ల భారీగా ఖర్చవుతుందన్నా.. ట్రంప్ వెనక్కి తగ్గలేదు. కానీ.. చివరికి సైనిక వాహనాల వినియోగం నుంచి పూర్తిగా వెనక్కి తగ్గారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలియజేయడానికే ట్రంప్ యంత్రాంగం సైనిక విమానాలను ఉపయోగించింది. సైనిక విమానాలను వాడడం ద్వారా తమ దేశం కోసం ఎంత కఠినంగానైనా వ్యవహరించగలం అని తెలియజేయాలనుకున్నారు. అలాంటి సందేశాన్నే సమర్థవంతంగా ప్రపంచానికి అందించారు కూడా.
భారతీయులూ సైనిక విమానంలోనే..
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను సైతం ట్రంప్ యంత్రాంగం భారీ సైనిక విమానాల్ని వినియోగించి తిప్పి పంపింది. కేవలం వలసదారుల్ని పంపేందుకే.. అత్యంత భారీ రవాణా విమానాలైన 30కి పైగా C-17 విమానాలను, డజనుకు పైగా C-130 విమానాలను ఉపయోగించారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్-ట్రాకింగ్ డేటా వెల్లడించింది. వెనక్కి తిప్పి పంపిన దేశాల్లో.. భారత్, పెరూ, గ్వాటెమాల, హోండురాస్, పనామా, ఈక్వెడార్, గ్వాంటనామో బే వంటి దేశాలున్నాయి. ఫిబ్రవరిలో వందలాది మంది భారతీయ అక్రమ వలసదారుల్ని బ్యాచుల వారీగా అమెరికా వైమానిక దళానికి చెందిన కార్గో విమానంలో దేశంలోకి తీసుకువచ్చారు. పైగా.. వారిని అరెస్టు చేసినప్పటి నుంచి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి… బంధించి తీసుకువచ్చారు.
చాలా ఖరీదైన వ్యవహారం
అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఒక్కో విమానానికి ప్రతీసారి $3 మిలియన్లు (3 Million US Dollars) అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.25 కోట్లు అవుతుంది. కేవలం డజను మందిని తీసుకెళ్లే గ్వాంటనామో విమానాలకు ఒక్కో వలసదారునికి కనీసం $20,000.. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.16.60 లక్షలు అవుతుంది. ఈ లెక్కన చూస్తే.. వలసదారుల్ని వాణిజ్య విమానాల్లో పంపించడమే చాలా సులువైన, తేలికైన, ఖరీదు తక్కువ వ్యవహారం అంటున్నారు.
ప్రభుత్వ డేటా ప్రకారమే.. US ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విమానానికి సగటున గంటకు $8,500 ఖర్చవుతుంది. అదే.. అంతర్జాతీయ ప్రయాణాలు ప్రయాణించే విమానాలకు గంటకు $17,000 అవుతుండగా… భారీ సరుకు, దళాలను తీసుకెళ్లడానికి రూపొందించిన C-17ను ఎగరడానికి అయ్యే ఖర్చు గంటకు $28,500 అని చెబుతున్నారు. అంటే.. ఖర్చు దాదాపు సగానికి పైగా పెరుగుతుంది.
Also Read : North Korea : తొలి అణు జలాంతర్గామిని పరిచయం చేసిన కిమ్ – దక్షిణ కొరియా, అమెరికాలు షాక్
పైగా.. సైనిక విమానాలు ఎగిరేందుకు వేరే మార్గాలు ఉంటాయి. అవి.. సాధారణంగా వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గాల్లో వెళ్లవు. వేరే దేశాల రాడార్ల పరిధిలోకి వెళ్లగానే.. అక్కడి రక్షణ వ్యవస్థలు శత్రు దేశాల విమానాలు అనుకుని ఎటాక్ చేసే ప్రమాదం ఉండడంతో పాటు, వారి రవాణా మార్గం వేరుగా ఉంటుంది. అందుకే.. ఇంధన ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని వల్ల ప్రయాణ మార్గం సైతం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.