US Federal Employees Firing Orders Invalid | అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజె (DOGE) విభాగానికి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. డోజె విభాగం తొలగించిన వేలాది ఫెడరల్ ఉద్యోగులను తక్షణమే తిరిగి పనిలో చేర్చాలని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి విలియమ్స్ అల్సప్ ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు సరిగా లేదన్న కారణంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజె విభాగం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తొలగింపులు చట్టవిరుద్ధమైనవని, ఇది ఒక బూటక చర్యగా భావించిన జడ్జి అల్సప్, ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఫెడరల్ ఏజెన్సీల నుంచి తొలగించబడిన ఉద్యోగులను తిరిగి పనిలో చేర్చాలని కోర్టు ఆదేశించినా.. ఇది ఓపీఎం (Office of Personnel Management) మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం తరపున న్యాయశాఖ వాదించింది. అయితే జడ్జి అల్సప్ ఈ వాదనను తిరస్కరించారు. ఉద్యోగుల తొలగింపు చట్టవిరుద్ధమని నొక్కి చెప్పారు. సైన్య వ్యవహారాలు, వ్యవసాయం, రక్షణ, ఖజానా శాఖలు వంటి ఆరు ఫెడరల్ ఏజెన్సీల ఉద్యోగులను తిరిగి వారి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు వర్తిస్తాయని కూడా స్పష్టం చేశారు.
Also Read: భారత్ లో అమెరికా మద్యంపై 150 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు.. అందుకే ప్రతీకారం!
ఈ విషయంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. ఉద్యోగుల తొలగింపు తనను కూడా బాధించిందని.. కానీ చాలా మంది ఉద్యోగులు సరిగ్గా పని చేయడంలేదని, అందుకే మంచి పనితీరు ఉన్నవారిని మాత్రమే కొనసాగించామని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కోర్టు ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం గమనార్హం. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టు ఆదేశాలను పై కోర్టులో సవాలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
ఎవరీ విలియమ్స్ అల్సప్?
79 ఏళ్ల విలియమ్స్ అల్సప్ ఒక సీనియర్ ఫెడరల్ న్యాయమూర్తి. హార్వర్డ్ నుంచి న్యాయవిద్య పూర్తి చేసిన ఆయన, సుప్రీం కోర్టు న్యాయమూర్తి విలియమ్ డగ్లస్ కు 1971-72 మధ్య క్లర్క్ గా పని చేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోలినా నార్త్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నియమితులయ్యారు. 2021 జనవరిలో సీనియర్ జడ్జి హోదా పొందారు.
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు చక్కబెట్టేందుకే డోజె
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) అనే కొత్త విభాగానికి చీఫ్‌గా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే డోజె ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ట్రంప్ ప్రభుత్వంలో సమర్థతను పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు.