Rupee Symbol Design DMK| జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం, తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషా వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా.. రూపాయి సింబల్ డిజైన్‌ను ఎవరు రూపొందించారు అనే అంశంపై నెటిజెన్ల మధ్య విపరీతమైన చర్చ జరుగుతోంది.
రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?
ఆ రూపాయి డిజైన్‌ను తయారు చేసిన వ్యక్తి మరెవరో కాదు, తమిళనాడు అధికార డీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎన్. ధర్మలింగం కుమారుడు మరియు ఐఐటీ ప్రొఫెసర్ డీ. ఉదయకుమార్ ధర్మలింగం. ఈ రూపాయి సింబల్‌ను మొట్టమొదటిసారిగా 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరిచయం చేసారు.
Also Read: కేంద్ర మంత్రి నిజంగా అంత బాధపడుతున్నారా?.. సీతారామన్‌కు విజయ్ కౌంటర్..
రూపాయి డిజైన్ ఎలా చేశారు?
2010లో యూపీఏ ప్రభుత్వం రూపాయి సింబల్‌ను డిజైన్ చేయడానికి దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. ఈ పోటీలో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఉదయకుమార్ కూడా పాల్గొన్నారు. రూపాయి సింబల్‌ను డిజైన్ చేసేటప్పుడు దేవనాగరి మరియు రోమన్ భాషలను కలిపి రూపాయి సింబల్‌ను తయారు చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనాగరి భాషలోని ‘ర’ అక్షరాన్ని మరియు రోమన్ భాషలోని ‘ఆర్’ అక్షరాన్ని కలిపి రూ (₹) సింబల్‌ను రూపొందించారు. ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు, కేంద్ర ప్రభుత్వం రూపాయి సింబల్ కోసం నిర్వహించిన పోటీ విజేతలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందలాది డిజైన్లను పరిశీలించిన తర్వాత, ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
భారత కరెన్సీలో రూపాయి సింబల్
2010 జూలై 15న, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు పెరిగిందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలోని మారూరు గ్రామంలో జన్మించిన ఉదయకుమార్, రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ప్రస్తుతం ఉదయకుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ (హెచ్‌ఓడీ)గా పనిచేస్తున్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేసిన గుర్తింపు పొందిన డిజైనర్.
తమిళనాడు బడ్జెట్ లో రూపాయి సింబల్ మార్పు
తమిళనాడు బడ్జెట్ ప్రతుల్లో రూపాయి హిందీ సింబల్‌ను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. ఆ సింబల్ స్థానంలో తమిళ భాషలో “రూ” అనే అక్షరాన్ని చేర్చింది. ఈ నిర్ణయం జాతీయ విద్యావిధానం (NEP-2020) మరియు త్రిభాషా సూత్రంపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని మరింత ముదిరించింది. రూపాయి సింబల్ మార్పును తమిళ సంఘాలు.. తమ మాతృభాషను కాపాడుకునే ప్రయత్నంగా స్వాగతించగా.. మరి కొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని కించ పరిచినట్లుగా విమర్శించారు. తమిళనాడు NEP-2020ను అమలు చేయడానికి నిరాకరించినందున, కేంద్రం రూ.573 కోట్ల నిధులను నిలిపివేసింది.