US Illegal Immigrants Arrest | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై వైట్‌హౌస్ స్పందిస్తూ, ట్రంప్ అధ్యక్షుడిగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రపంచానికి బలమైన సందేశం పంపిస్తున్నారని పేర్కొంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. వీరిని అమెరికా నుంచి బహిష్కరించేందుకు ప్రత్యేక విమానాలు ప్రారంభించామని వెల్లడించింది.
అంతకుముందు వైట్‌హౌస్ మరో ప్రకటన చేస్తూ, ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేయడంతో పాటు 373 మందిని నిర్బంధించినట్లు తెలిపింది. అరెస్టైన వారిలో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాలు వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నవారని వివరించింది. అమెరికా చరిత్రలోనే ఇదే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌గా నిలుస్తుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అమెరికా ప్రజల రక్షణకు సంబంధించిన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ‘‘గత నాలుగేళ్లలో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగింది. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండానే సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారు. అందుకే అక్రమ వలసల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం’’ అని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
Also Read: అమెరికా ప్రెసిడెంట్‌కు ఉన్న అధికారాలేమిటీ? ఇండియాకు, యూఎస్‌ఏకు ఉన్న తేడాలివే!
అంతేకాకుండా, ట్రంప్ ఆదేశాల మేరకు దక్షిణ సరిహద్దుల రక్షణను బలోపేతం చేయడానికి 1,500 మంది సిబ్బందిని పంపిస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. మరోవైపు, అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపుతున్న సందర్భంలో, మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేస్తోందని సమాచారం. టెక్సాస్‌లోని ఎల్‌పాసో సరిహద్దుకు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో మెక్సికో ప్రభుత్వం పెద్ద ఎత్తున శిబిరాలు నిర్మిస్తోందని స్థానిక మీడియా తెలిపింది.
అమెరికా అక్రమ వలసలపై భారత్ స్పందన
అమెరికా అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో, ఈ విషయంపై భారత్ కూడా స్పందించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే ఇది అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. అయితే, వీసా గడువు ముగిసినప్పటికీ లేదా సరైన పత్రాలు లేకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. సంబంధిత డాక్యుమెంట్లను అందిస్తే, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించింది.