US Immigration Indians| ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్‌పోర్టులు, సీ పోర్టుల వంటి ఎంట్రీ పాయింట్ల వద్ద తనిఖీలు తీవ్రంగా జరుగుతున్నాయని సమాచారం. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు దేశంలోకి ప్రవేశించే వారి ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలోని డేటా కూడా తనిఖీలు చేస్తున్నారు. వారెంట్ అవసరం లేకుండానే, లోతుగా తనిఖీలు చేసి, వారి ఫోన్, ల్యాప్ టాప్ లోని డేటా కాపీ చేసేందుకు అధికారాలు ఉన్నాయి. పరికరాల్లో అనుమానాస్పద సమాచారం ఉంటే, ఉన్నతస్థాయి అధికారుల నుంచి అనుమతి తీసుకుని “అడ్వాన్స్ సెర్చ్” నిర్వహిస్తున్నారు.
వీసాదారులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు, పౌరులకు హక్కులు వేరేలా ఉంటాయి. వీసాదారులు పాస్‌వర్డ్ చెప్పకపోతే ఎంట్రీ నిరాకరణకు గురవవచ్చు. పరికరాన్ని స్వాధీనం చేసుకుంటే ఫామ్ 6051-D తీసుకోవాలి. పరికరంలో ఏదైనా చట్ట వ్యతిరేక లేదా నేరపూరితమైన డేటా లేకపోతే, 21 రోజుల్లోపు కాపీ చేసిన డేటాను అధికారులు తొలగిస్తారు.
అందుకే ప్రయాణికులు.. నిపుణుల ప్రకారం.. ప్రయాణానికి అవసరమైన పరికరాలే తీసుకెళ్లాలి, వ్యక్తిగత సమాచారం తక్కువగా ఉండాలి, సున్నితమైన యాప్‌ల నుంచి సైన్ అవుట్ కావాలి, బ్యాకప్ తీసుకోవాలి. CBP అధికారులు లోకల్ డేటానే మాత్రమే చూడగలరు, అందుకే డేటా స్టోరేజ్ కోసం క్లౌడ్ డేటా సదుపాయాలను ఉపయోగించడం మంచిది.
చిన్న తప్పిదాలకు వీసాలు రద్దు
అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తూ, నెలరోజుల్లో 1000కు పైగా విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ముఖ్యంగా చిన్న తప్పిదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలే కారణాలుగా చూపుతున్నా, కొన్ని వీసా రద్దులకు స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రసిద్ధ విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఈ ప్రభావానికి లోనయ్యారు. వీసా రద్దుతో డిపోర్టేషన్ ముప్పుతో పాటు అరెస్టు భయం కారణంగా కొంతమంది చదువు పూర్తికాకుండానే అమెరికా విడిచి స్వదేశాలకు పోతున్నారు.
ప్రభుత్వం సరైన కారణాలు లేకుండానే వీసాలు రద్దు చేస్తోందని నిపుణలు వాదిస్తున్నారు. దీనిపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ పరిణామాలపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలేజీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా, మరికొన్ని విద్యార్థులకు ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నాయి.
Also Read: విమానం హైజాక్ చేసిన దుండగుడు.. తుపాకీతో కాల్చి చంపిన హీరో
అత్యధికంగా భారతీయుల వీసాలు రద్దు
అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు ఊహించని స్థాయిలో పెరిగింది. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం, ఇటీవల రద్దయిన 327 వీసాలలో సగం భారతీయులవే. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ఇవేవీ తగిన కారణాలు లేకుండా జరిగాయని, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని లాయర్లు, కళాశాలలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా, దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ప్రభావితమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ద పత్రాలు లేని విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.