అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాల పర్యటన ఆసక్తికరంగా సాగింది. ట్రంప్ అమెరికానుంచి బయలుదేరక ముందే ఇది సంచలనంగా మారింది. ట్రంప్ కి ఖతర్ 400 మిలియన్ డాలర్ల విమానాన్ని బహూకరించాలనుకోవడంతో ఈ పర్యటన చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ట్రంప్ కి దెయ్యాల స్టైల్ లో స్వాగతం సహా ఇతరత్రా కార్యక్రమాలతో ఈ పర్యటన వార్తల్లో నిలిచింది. ట్రంప్ పర్యటనలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రంప్ కి ఒక నాణ్యమైన ఆయిల్ డ్రాప్ ని యూఏపీ బహూకరించింది.
ఆయిల్ డ్రాప్..
అవును అది ఒకే ఒక్క ఆయిల్ డ్రాప్. ఆ ఆయిల్ చుక్కను కూడా భద్రంగా సీల్ చేసి, ఒక అందమైన గిఫ్ట్ ప్యాక్ లో పొందుపరచి ట్రంప్ కి అందించారు. యూఏఈ పరిశ్రమల శాఖ మంత్రి అహ్మద్ అల్ జాబర్. ఆయన అడ్నాక్ అనే కంపెనీ సీఈఓ కూడా. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీని అడ్నాక్ అని పిలుస్తారు. ఆ కంపెనీ తరపున, యూఏఈ తరపున కూడా ఆయిల్ చుక్కను ట్రంప్ కి బహుమతిగా అందించారు అహ్మద్ అల్ జాబర్.
మర్బన్ ఆయిల్
దాన్ని మర్బన్ ఆయిల్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ముడిచమురు అది. యుఎఇ స్పెషల్ ఆయిల్ అది. అందులో సల్ఫర్ కంటెంట్ తక్కువ. బరవు కూడా చాలా తక్కువ. దీన్ని శుద్ధి చేయడం కూడా చాలా ఈజీ. జెట్ ఇంధనాల తయారీకి, ప్రీమియం గ్యాసోలిన్ తయారీకి, హై-గ్రేడ్ డీజిల్ ఉత్పత్తికి ఇది అనువైనదిగా భావిస్తారు. యుఎఈలో రోజుకి 2 మిలియన్ బ్యారెళ్ల మర్బన్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. రోజుకు 1.6 మిలియన్ బారెల్స్ ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
“The highest quality oil there is on the planet and they only gave me a drop of it…so I’m not thrilled!” 🤣 pic.twitter.com/84U8vTMbUU
— Margo Martin (@MargoMartin47) May 16, 2025
ట్రంప్ జోక్..
ఆయిల్ డ్రాప్ బహూకరణ కార్యక్రమానికి ట్రంప్ రియాక్షన్ హైలైట్ గా నిలిచింది. యూఏఈ మంత్రి నుంచి ఆయిల్ డ్రాప్ ఉన్న గిఫ్ట్ ప్యాక్ ని చేతిలోకి తీసుకున్న ట్రంప్.. ఏందిటి ఒక చుక్కేనా అని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. ట్రంప్ ఆ హ్యూమర్ మూడ్ ని మరింత కంటిన్యూ చేశారు. పోనీలే.. అసలేమీ లేనిదానికంటే ఒక్క చుక్కయినా ఇచ్చారంటూ మరింత కామెడీ చేశారు. దీంతో నవ్వులు మరింత గట్టిగా వినిపించాయి. అమెరికా అధ్యక్షులలో ట్రంప్ కి మంచి కామెడీ టైమింగ్ ఉందని అంటారు. కొన్నిసార్లు ఆయన అభాసుపాలయినా.. తన జోకుల్ని మాత్రం ఆపరు. ఎదుటివారు నవ్వినా, తాను నవ్వులపాలయినా కూడా ట్రంప్ తనదైన శైలిలోనే మాట్లాడుతుంటారు. హావాభావాలు ప్రదర్శిస్తుంటారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత తన విపరీత పన్నుల విధానంతో ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని మొదలు పెట్టారు ట్రంప్. ఆయన్ను ప్రసన్నం చేసుకోడానికి దేశాలన్నీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఖతర్ ఎగిరే భవంతి లాంటి భారీ విమానాన్ని ట్రంప్ కి ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ అరబ్ దేశాల పర్యటనపై అమెరికాలోని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేయడం ఇక్కడ కొసమెరుపు.