Yashaswini Reddy : మామిడాల యశస్వినిరెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మారుమోగిన పేరు. ఈ 26 ఏళ్ల అమ్మాయి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డిని ఓడించి వార్తల్లో నిలిచారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా చరిత్ర క్రియేట్ చేశారు. ఎలక్షన్లు ముగిశాయి.. చరిష్మా సన్నగిల్లుతోంది. బీఆర్ఎస్ నుంచి కానీ, ఎర్రబెల్లి నుంచి కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కాంగ్రెస్‌లో ఇంటిపోరే ఆమెకు ఇబ్బందిగా మారింది. యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారారనే విమర్శ వినిపిస్తోంది. అంతలోనే పార్టీలో గ్రూప్ వార్ మొదలైంది. అత్తాకోడళ్లు అంటూ సొంతపార్టీ నేతలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఇన్నా్ళ్లూ ఇంటర్నల్‌గా సాగుతున్న ఆ వివాదం లేటెస్ట్‌గా రచ్చ కెక్కింది. ఇరువర్గాలు పరస్పరం బహిరంగంగా తగాదాకు దిగడం, విమర్శించుకోవడంతో గుట్టుగా సాగుతున్న గొడవ రోడ్డున పడింది. ఇంతకీ పాలకుర్తిలో అసలేం జరిగిందంటే…
దేవరుప్పలలో దేత్తడి..
పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశానికి వచ్చిన పెద్ది కృష్ణమూర్తి అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో రచ్చగా మారింది. ఎందుకు తమను ఆపుతున్నారంటూ పోలీసులతో కృష్ణమూర్తి వర్గం వాగ్వాదానికి దిగింది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిల నియంత పోకడ నశించాలంటూ నినాదాలు చేశారు. సన్నాహక సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు పెద్ది వర్గాన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
పాలమూరు బిడ్డ.. పాలకుర్తి కోడలు గర్జన..
సొంత పార్టీ కార్యకర్తలపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు బిడ్డ సహనం నశించిపోయిందని.. ఇక పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుందంటూ ఘాటుగా హెచ్చరించారు. పార్టీకి, తమకు నష్టం చేస్తుంటే చూస్తూ కూర్చోబోనని అన్నారు. ఎన్ని మాటలు అంటున్నా ఇన్నాళ్లూ ఓపిక, సహనంతో భరించానని.. ఇకపై వదిలేదేలే అంటూ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేస్తూ మోసం చేసే వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ అల్టిమేటం జారీ చేశారు.
Also Read : యూట్యూబర్ జ్యోతి అరెస్ట్.. పాక్‌కు ఆర్మీ సీక్రెట్స్..
పాలకుర్తి నుంచి తరిమేస్తాం..
అటు, ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గం నేత పెద్ది కృష్ణమూర్తి సైతం అదే స్థాయిలో రెచ్చిపోయారు. యశస్వినిరెడ్డితో పాటు ఆమె అత్త ఝాన్సీరెడ్డిపై ఫైర్ అయ్యారు. దొంగలను, ఇతర పార్టీలకు సద్దులు మోసే వ్యక్తులను అక్కున చేర్చుకున్నారంటూ మండిపడ్డారు. కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలో నుంచి తొలగించారంటూ ఆరోపించారు. అత్తాకోడళ్లను చూసి ఎవరూ ఓట్లు వేయలేదని.. కాంగ్రెస్ గెలుపు కోసం తామే కష్టపడ్డామని.. కేసులు భరించామని చెప్పుకొచ్చారు. రావణాసురుడు లాంటి దయాకర్‌రావును ఓడించింది తామేనని.. శూర్పణఖ మాటలకు భయపడే వారు ఎవరు లేరంటూ పెద్ది కృష్ణమూర్తి సైతం ఓ రేంజ్‌లో మాటల దాడి చేశారు. పాలకుర్తికి టూరిస్టులు లాంటి లీడర్లు ఎంతోమంది వచ్చిపోతుంటారని.. అత్తాకోడళ్లను ఇక్కడి నుంచి తరిమికొడతామన్నారు పెద్ది.