US Seized plane : ఆమెరికా ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్.. అగ్రరాజ్యం ప్రయోజనాలు, ఉద్దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలు, సంస్థలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వెనిజులా ప్రభుత్వ అధికారిక విమానాన్నిడొమినికన్ రిపబ్లిక్ దేశంలో అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ అధికారికంగా వెల్లడించింది. కాగా.. స్వాధీనం చేసుకున్న విమానాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గురువారం పరిశీలించారు. అసలు.. వెనిజులా దేశ ప్రభుత్వ విమానాన్ని అమెరికా ఎలా స్వాధీనం
చేసుకుంది. అలాంటి అధికారం ఎక్కడిది అంటే.. దీనికి ఓ కారణం ఉంది అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ఇటీవల కాలంలో డొమినికల్ రిపబ్లిక్ లో అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్న రెండో విమానమిది. గతంలో ఓ విమానాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. దానిని పూర్తిగా వారి నియంత్రణలోకి తీసుకున్నారు. కాగా.. అమెరికా ప్రభుత్వ ఆంక్షలు, ఎగుమతుల నియంత్రణలు సహా మనీలాండరింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాల్లో.. అమెరికా సమకూర్చిన విమానాల్ని, ఇతర వాహనాల్ని తిరిగి పొందేందుకు తమకు అధికారం ఉంటుందని అమెరికా అధికారులు అంటున్నారు. అమెరికా స్వాధీనం చేసుకున్న విమానం శాంటో డొమింగో ఎయిర్పోర్టులో నిలిపి ఉంచినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. తన లాటిన్ అమెరికాలో చివరి పర్యటన ముగించుకున్న రూబియో.. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల అధీనంలోని విమానానికి వారెంట్ అతికించి, దానిని అధికారికంగా స్వాధీనం చేసుకున్న విమానాన్ని పరిశీలించారు.
అమెరికా నుంచి ఈ విమానాన్ని వెనిజుల ఆయిల్ సంస్థ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి దీనిని అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం వినియోగించారని అమెరికా అధికారులు గుర్తించారు. పైగా.. ఈ విమానాన్ని ఒక షెల కంపెనీ ద్వారా చట్టవిరుద్ధంగా 13 మిలియన్ల అమెరికా డాలర్లకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆపై.. దీనిని వెనిజుల అధ్యక్షుడు నికోలస్ ముదురో, అతని అత్యున్నత అధికారుల బృందం కోసం వినియోగిస్తున్నారు. వాస్తవానికి వెనిజుల – అమెరికా మధ్య అనేక ఏళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు సైతం సరిగా లేవు. ఇటీవల ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత.. వలసదారుల్ని వెనక్కి పంపించడాన్ని తప్పుపడుతూ వెనిజుల అధ్యక్షుడు ముదురో వ్యాఖ్యలు చేశారు. వీటిని ప్రతీకారంగా అమెరికా తాజా చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి సభ్యులు గ్రీస్, టర్కీ, రష్యా, నికరాగ్వా, క్యూబాకు ప్రయాణించడానికి డస్సాల్ట్ ఫాల్కన్ 200 విమానాలను ఉపయోగించారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. క్యూబా వలసదారుల కుమారుడు రూబియో.. అమెరికా సెనేటర్‌గా ఉన్నప్పటి నుంచే కమ్యూనిస్ట్ నేతృత్వంలోని క్యూబా ప్రభుత్వానికి మిత్రదేశమైన మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలంటూ అమెరికా నాయకత్వానికి అభ్యర్థిస్తూ, ఆ దేశానికి వ్యతిరేకంగా అధ్యక్షుల నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడు.
మరోవిషయంలోనూ అమెరికా – వెనిజుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో వెనిజుల అధ్యక్షుడిగా ముదురో ఎన్నికల్లో గెలుపొందినట్లు ప్రకటించుకోగా, ఆ ఎన్నికను అమెరికా గుర్తించడం లేదు. జూలై 2024 ఓటింగ్‌లో మదురో ప్రభుత్వ మద్దతుతో సాధించిన విజయాన్ని ప్రతిపక్షాలు, అంతర్జాతీయ పరిశీలకులు సహా.. అమెరికాతో సహా అనేక దేశాలు అంగీకరించడం లేదు. గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాయబారి రిచర్డ్ గ్రెనెల్ ముదురోతో చర్చల కోసం సమావేశమైయ్యారు. వెనిజులాలో నిర్బంధించిన ఆరుగురు అమెరికన్లను విడిచిపెట్టాల్సిందిగా కోరారు. అలాగే.. అమెరికా తిరిగి పంపిస్తున్న వెనిజుల దేశీయులను అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు.