US Tariffs: అమెరికా విధించిన భారీ దిగుమతి సుంకాలు భారత గార్మెంట్ కంపెనీలకు షాక్ ఇచ్చాయి. అక్కడికి దుస్తులు పంపాలంటే ఖర్చు పెరగడంతో వ్యాపారంపై ఒత్తిడి పెరిగింది. కొన్ని కంపెనీలకు ఆర్డర్లు తగ్గగా.. మరికొన్ని ధరలు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాపైనే ఆధారపడితే నష్టమని భావిస్తున్న కంపెనీలు కొత్త మార్కెట్లను వెతుకుతున్నాయి.
84% బిజినెస్ కట్!
ఈ మార్పుకు ఓరియంట్ క్రాఫ్ట్ కంపెనీ ఒక ఉదాహరణ. గతంలో ఈ సంస్థ అమ్మకాల్లో అమెరికా వాటా 84 శాతంగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 శాతం కంటే తక్కువకు తగ్గించింది. బ్రిటన్, యూరప్‌తో పాటు మన దేశంలోనూ వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరో కంపెనీ గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ కూడా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి యూరప్ మార్కెట్‌లో వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యూఎస్ కష్టాల్లో టెక్స్‌టైల్ రంగం..
ఎగుమతుల లెక్కలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అమెరికాకు భారత దుస్తులు, టెక్స్‌టైల్ ఎగుమతులు 9.8 శాతం తగ్గాయి. అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు 3.7 శాతం పెరిగాయి. బ్రిటన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం కూడా భారత కంపెనీలకు కొత్త అవకాశాలను తెస్తోంది.
బ్రిటన్, యూరప్ వైపు భారత దుస్తుల ఎగుమతులు!
అమెరికా మార్కెట్ తగ్గినా భారత కంపెనీలకు దేశీయ మార్కెట్ రూపంలో మరో అవకాశం ఉంది. మన దేశంలో దుస్తుల వ్యాపారం ఏటా పెరుగుతోంది. దీంతో ఎగుమతులతో పాటు స్వదేశీ మార్కెట్‌పైనా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. మొత్తానికి అమెరికా టారిఫ్‌ల దెబ్బతో భారత గార్మెంట్ కంపెనీలు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఒకే దేశంపై ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డాయి.
Also Read: ఆ 558 మంది భవిష్యత్తు ఏమిటి? డీఎంఈ నిర్ణయంతో రోడ్డున పడ్డ వైద్య సిబ్బంది!