America: ఏదో విధంగా విదేశీ విద్యార్థులను స్వదేశానికి పంపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ట్రంప్ సర్కార్. ఈ విషయంలో ఎవరు చెప్పినా ఏ మాత్రం వినడం లేదు. ఫస్ట్ అమెరికా ఆ తర్వాతే ఎవరనా అని అంటోంది. తాజాగా విదేశీ విద్యార్థులకు ఊహించని విధంగా ఝలక్ ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యా సంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, క్లాస్‌లు ఎగ్గొట్టినా స్టూడెంట్ వీసా రద్దవుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.
విదేశీయులను స్వదేశాలను పంపించేందుకు ట్రంప్ సర్కార్ కొత్త చట్టాలను పదును పెడుతోంది. ఓ వైపు అక్కడ నివాసం ఉంటున్నవారిని ఏదో విధంగా వారి దేశాలకు పంపిస్తోంది. తాజాగా ప్రభుత్వం దృష్టంతా విద్యార్థులపై పడింది. స్టూడెంట్ వీసాల పేరుతో వచ్చి అమెరికా సెటిలవుతున్నారని భావించింది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
రకరకాల కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తోంది ట్రంప్ సర్కార్. తమ విద్యా సంస్థల్లో చదివే ఫారెన్ విద్యార్థులు(భారత విద్యార్థులు కూడా)తరగతుల గైర్హాజరు ఆధారంగా వీసాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా ఎంబసీ మంగళవారం ఓ ప్రకటన చేసింది.
ఆ ప్రకటన ప్రకారం.. విద్యాసంస్థ నుంచి డ్రాపౌట్ అయినా మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే. క్లాస్‌లు ఎగ్గొట్టినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా విద్యార్థుల వీసా రద్దు అవుతుందని తేల్చి చెప్పింది. అలాంటి వారు ఫ్యూచర్‌లో అమెరికా వీసాల అర్హత కోల్పోతారని తేల్చి చెప్పింది. వీటి బారిన పడకుండా ఉండాలంటే జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని ఆ ప్రకటనలో ఎంబసీ తెలిపింది.
ALSO READ: ట్రంప్ హోటల్స్‌లో పెట్టుబడులు అంతా ఫ్రాడ్, భారతీయులకు కోట్లలో నష్టాలు
ట్రంప్ సర్కార్ నిర్ణయంతో అక్కడ ఉన్న ఫారెన్ విద్యార్థులు, వెళ్లబోయేవారిలో టెన్షన్ మొదలైంది. విదేశాల్లో భారత విద్యార్థుల సంఖ్య 18 లక్షలకు చేరుకుందని భారత విదేశాంగ శాఖ లెక్కలు చెబుతున్నాయి. రెండేళ్ల కిందట ఆ సంఖ్య 13లక్షలు ఉండగా ఈ ఏడాది భారీగా పెరిగింది. అమెరికాలోనే ఎక్కువ మంది భారతీయులు చదువుకుంటున్నారు.
ట్రంప్ సర్కార్ నిర్ణయంతో విద్యార్థుల దృష్టి కెనడా, యూకే, ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది రికార్డు స్థాయిలో 3 లక్షల పైచిలుకు భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. అదే కెనడాలో లక్షా 37 వేలు, యూకేలో దాదాపు లక్ష మంది చదువుకుంటున్నారు.
ట్రైనింగ్ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులకు యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ట్రైనింగ్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోగా ఉపాధిపై వివరాలు తెలియ జేయాలని తెలిపింది. లేకుంటే చట్టబద్ధ హోదాను కోల్పోతారని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది. ఎంబసీ జారీ చేసిన ప్రకటనతో విద్యార్థుల్లో గందరగోళం మొదలైంది.