USA Eggs Smuggling Rise| పౌష్టికాహారమైన కోడి గుడ్లు ఇప్పుడు అమెరికా ప్రజలకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. కోడి గుడ్లు కొనాలంటే అమెరికన్లు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యం డజను కోడి గోడ్ల ధర దాదాపు 10 డాలర్ల. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.870. అమెరికన్లు ఎక్కువగా తినే ఆహారం కోడి గుడ్లు కావడంతో ఆ దేశానికి ప్రతి రోజు పొరుగు దేశాల నుంచి భారీ స్థాయిలో కోడి గుడ్లు దిగుమతి అవుతూ ఉంటాయి. అయితే అమెరికా బర్డ్ ఫ్లూ విజృంభణతో అక్కడ కోడి గుడ్లపై ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆంక్షలతో కోడి గుడ్లను కొంత మేర అనుమతిచ్చింది. కానీ ఆ దిగుమతులు ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే దొంగచాటుగా కోడి గుడ్ల రవాణా జరుగుతోంది. దీంతో కోడి గుడ్ల స్మగ్లింగ్ చేస్తూ అక్రమార్కులు భారీగా సంపాదించేస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా కన్నా ఈ వ్యాపారమే గిట్టుబాటు అవుతోంది వారికి.
గుడ్లు భారీగా డిమాండ్ ఉండడంతో పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిల్ లేదా ఇతర డ్రగ్స్ కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహభాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్‌వర్కులకు ఇదే మంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట.
కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ పెద్ద ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. కెనడాపై విధించిన సుంకాలకు ప్రధాన కారణాల్లో ఫెంటానిల్ డ్రగస్ అక్రమ రవాణా కూడా ఒకటి. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్‌మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!
Also Read: అమెరికాతో బలమైన సంబంధాల కోసమే, ఒత్తిడి వల్ల కాదు.. సుంకాల తగ్గింపుపై భారత్
డ్రగ్స్ కంటే కోడి గుడ్ల అక్రమ రవాణా కేసులు 10 రెట్లు!
2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ప్రమాదకర ఫెంటానిల్ డ్రగ్స్ పట్టుబడ్డ ఘటనలు కేవలం 352 మాత్రమే ఉన్నాయి.
మరోవైపు కోడి గుడ్ల ధరలపై అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలో కోళ్లను పెంచుకోవాలని సూచించారు. ట్రంప్ సూచనలతో ఇప్పటికే అమెరికాలో “రెంట్ ది చికెన్” పేరుతో కొత్త బిజినెస్ మొదలైంది. ఆరు నెలల కాలానికి అద్దెకు కోళ్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కోడి వారానికి ఐదు గుడ్లు పెడుతుందని… ఒక్కో కుటుంబం ఐదు కోళ్లు అద్దెకు తీసుకోవాలంటూ “రెంట్ ది చికెన్” కంపెనీ ఓనర్ రోలిన్స్ పిలుపునిచ్చారు.
విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ!
బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజను కు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న గుడ్ల సంక్షోభం పరిస్థితి చేయి దాటిపోయిందని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అంగీకరించారు. 2025 సంవత్సరం చివరకల్లా కోడి గుడ్ల ధరలు మరో 50 శాతానికి పైగా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది!