వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్స్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో విద్వేసం రెచ్యగొట్టేలా పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పోస్టులతో అందరిలోనూ అశాంతికి కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అలాగే, మెటా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాట్సాప్ ను కూడా ఎవరూ ఉపయోగించవద్దని దేశ ప్రజలకు నికోలస్ మడురో కోరారు. కాగా, గతంలో నికోలస్, మస్క్ మధ్య జరిగిన విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు పది రోజులపాటు ఎక్స్ సేవలు నిలిచిపోనున్నాయి.
అంతకుముందు వెనిజులా ఎన్నికల్లో ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నిక్లలో ఎలాన్ మస్క్.. మడురో ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు సపోర్ట్ చేశారు. తర్వాత ఈ ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. ఈ గెలుపుపై విపక్షాలు ఓ రేంజ్ లో విమర్శలు చేశాయి. మడురో అప్రజాస్వామిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ విమర్శలకు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు. దీంతో మడురో ఆయననను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం మొదలైంది.
ఇదిలా ఉండగా, ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, మడురో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిరసన కారులు రోడ్లపై ఆందోళనలు చేశారు. ఈ అల్లర్లలో సుమారు 23 మందికి పైగా మృతి చెందారు. ఈ క్రమంలోనే నిరసనకారులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో పది రోజుల పాటు ఎక్స్ పై నిషేధం విధిస్తున్నట్లు వెనిజులా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు.