US Deportation Indian Researcher| అమెరికాలో వలసదారులను డిపోర్ట్ (బహిష్కరణ) చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై న్యాయస్థానం మండిపడింది. ఒక భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని (Badar Khan Suri) అమెరికా నుంచి బహిష్కరించకూడదని అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు అనుమతి లేదని వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో సంబంధాలు ఉన్నాయని బాదర్ ఖాన్ సూరిపై ఆరోపణలతో ట్రంప్ ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి, బహిష్కరించడానికి (తిరిగి అతడి దేశానికి పంపించేందుకు) ప్రయత్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చినప్పడి నుంచి తనదైన పద్ధతులతో ముందుకు సాగుతున్నారు. తాను చేసేది రాజ్యాంగబద్ధమే అని పేర్కొంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలను కోర్టులు అడ్డుకుంటున్నాయి. హమాస్ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని అమెరికా భద్రతా అధికారులు అరెస్టు చేశారు. త్వరలోనే అతడిని భారతదేశానికి తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు.
Also Read: భారత్ సుంకాలు తగ్గించాలి లేకుంటే.. ట్రంప్ వార్నింగ్
అయితే, ఈ చర్యలను సవాలు చేస్తూ బాదర్ ఖాన్ సూరి కోర్టుకు వెళ్లారు. తన భార్య పాలస్తీనా మూలాలు కలిగి ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని, తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని తన పిటిషన్‌లో సూరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాదర్ ఖాన్ సూరిని అమెరికా నుంచి బహిష్కరించకూడదని వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తెలిపింది. ఇమ్మిగ్రేషన్ హోదాను రద్దు చేయడం, రాజకీయ దృక్పథం ఆధారంగా వారిని నిర్బంధించడం సరైనది కాదని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు అనుమతి లేదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బాదర్ ఖాన్ సూరి ఎవరు?
భారత దేశానికి చెందిన బాదర్ ఖాన్ సూరి (Badar Khan Suri) స్వస్థలం గురించి ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే, ఆయన విద్యాభ్యాసం మొత్తం ఇండియాలోనే జరిగింది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో శాంతి, సంఘర్షణ అధ్యయనాలపై పీహెచ్‌డీ చేసిన ఆయన, ఆ తర్వాత ఇరాక్, అఫ్గనిస్తాన్‌లో శాంతి నిర్మాణంపై పరిశోధనలు చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్, మఫెజ్ అహమద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాలున్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్ గ్రూప్‌లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్‌గా డీహెచ్ఎస్ గుర్తించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్టు కావడంతో, జాతీయ భద్రత, వ్యక్తిగత హక్కులు, విద్యాసంస్థలపై రాజకీయాల ప్రభావం వంటి అంశాలు ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి.
అమెరికా విదేశాంగ విధానం ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే విదేశీయులను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సూరిపై అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి గత ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్ హోల్డర్ అయిన మహమ్మూద్ ఖలీల్‌ను అమెరికా నుంచి సొంత దేశానికి తిరిగి సాగనంపారు.