
whisky : అదో అరుదైన స్కాచ్ విస్కీ. అరుదైనది కాబట్టి ధర కూడా ఎక్కువే ఉండొచ్చు. ఇంతకీ ఆ విస్కీ బాటిల్ విలువ ఎంతో ఊహించగలరా? ఒకటీ అరా కాదు.. ఏకంగా రూ.22.49 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిల్ ఇదేనని చెబుతున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోథబీస్(Sotheby’s) శనివారం ఆ బాటిల్‌ను వేలం వేసింది. ప్రపంచంలో అధిక డిమాండ్ ఉన్న స్కాచ్ విస్కీ బాటిళ్లలో మెకాలిన్ అదామీ 1926 సింగిల్ మాల్ట్ (Macallan Scotch whisky) ఒకటి. వేలంలో ఈ బాటిల్‌కు ఊహించిన దాని కన్నా రెట్టింపు ధర లభించడం విశేషం.
విస్కీ ఎంత పాతదైతే దాని రుచి అంతగా పెరుగుతుంది. దాంతో పాటే ధర కూడా ఆకాశాన్ని అంటుతుంది. ఈ విస్కీ 97 ఏళ్ల నాటిది. దీనిని 60 ఏళ్ల పాటు పీపాల్లో నిల్వ చేశారు. 1986లో మెకాలిన్ 40 బాటిళ్ల విస్కీని సిద్ధం చేసింది. ఇప్పటివరకు వాటిలో ఒకే బాటిల్‌ను వినియోగించినట్టు తెలుస్తోంది. కొన్ని బాటిళ్లు మాత్రం మెకాలిన్ టాప్ క్లయింట్లకు చేరాయి.
మెకాలిన్ 1926 సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ బాటిళ్లను ఎప్పుడు వేలం వేసినా.. ఊహించని రీతిలో ధర లభిస్తుంటుందని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి బాటిల్‌నే 2019లో వేలం వేయగా రూ.15.56 కోట్లు పలికింది.