Zimbabwe Elephants| ఆఫ్రికా దేశాల్లో భీకరమైన కరువు పరిస్థితులున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ప్రజలు ఆహారం లేక తల్లడిల్లుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల దక్షిణ ఆఫ్రికా దేశాలైన జాంబియా, జింబాబ్వే, దక్షిణ మలావి, ఉత్తర నమీబియా, ఆగ్నేయ అంగోలా, బోట్స్వానా, లెసోతో, సెంట్రల్ మొజాంబిక్, మధ్య దక్షిణ ఆఫ్రికా, మడగాస్కర్‌లోని కొన్ని ప్రాంతాలలో నీరు లేక చెరువులు, నదీజలాలు ఎండిపోయాయి. దీంతో పంటలు పండలేదు, పశువులకు సైతం అడవుల్లో నీరు లభించడం లేదు. గత 100 సంవత్సరాల్లో ఇంతటి తీవ్రమైన కరువు రాలేదని పర్యావరణవేత్త అభిప్రాయం.
పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే 2024 సంవత్సరంలోనే జాంబియా దేశంలో ఇప్పటివరకు కరువు వల్ల 700 మంది చనిపోయారని అధికారిక సమాచారం. వీరిలో జింబాబ్వేవే కూడా వంది మందికి పైగా చనిపోయారు. ఇంట్లో చిన్నపిల్లలు ఆహారం లేక బక్కచిక్కిపోయి ఎముకల శరీరంతో అంతర్జాతీయ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కరువు వల్ల జింబాబ్వేలోని కరిబా చెరువు ఎండిపోయింది. తినడానికి గ్రాసం లేక పశువులు చనిపోతున్నాయి. ఆఫ్రికా దేశాలు సాయం కోసం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైపు దేహి అంటూ సాయం కోసం దీనంగా చూస్తున్నాయి.
Also Read: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్
ఇలాంటి నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో ఏనుగులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వాటిని వధించి.. వాటి మాంసాన్ని ప్రజలకు ఆహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇప్పటికే జాంబియా దేశంలో దాదాపు 83 ఏనుగులు సహా 700 అడవి జంతువులును వధించేందుకు మూడు వారాల క్రితం ప్రభుత్వం అనుమతించింది. తాజాగా జింబాబ్వే దేశ ప్రభుత్వం కూడా 200 ఏనుగులు చంపేందకు అనుమతిచ్చింది.
అయితే ఏనుగులను వధించేందుకు కేవలం తీవ్ర ఆహార కొరత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అనుమతులిచ్చామని జింబాబ్వే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధులు తెలిపారు.
ఆఫ్రికా దేశాల్లో బోట్సవానా దేశం తరువాత అత్యధిక సంఖ్యలో ఏనుగులు జింబాబ్వేలో ఉన్నాయి. జింబాబ్వే అడవుల్లో 45000 ఏనుగులకు సరిపడా ఆహార వనరులుండగా.. వాటి జనాభా 84000కు చేరిందని దీంతో ఏనుగులు జనావాసాల మీదకు తరుచూ రావడం అక్కడ సమస్యగా మారింది. ఏనుగుల సంఖ్య దాదాపు రెండింతలు ఉండడంతో కొన్ని సంవత్సరాలుగా వాటి వల్ల అక్కడి ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటోంది. 2024 సంవత్సరంలో ఇప్పటివరకు 31 మంది ఏనుగుల దాడిలో చనిపోయారని స్థానిక మీడియా తెలిపింది. పైగా ఇప్పటివరకు ఆహారం లేక 100 ఏనుగులు కూడా చనిపోవడం గమనార్హం.
ఇప్పుడు దేశంలో కరువు పరిస్థితులు ఉండడంతో ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతించింది. పొరుగు దేశమైన నమీబియాలో 700 అడవి జంతువులు వధించేందుకు అనుమతి లభించగా.. ఇప్పటివరకు 150 జంతువులను వధించి ప్రజలకు 125000 పౌండ్ల (57000 కేజీల) మాంసం పంపిణీ చేశారు.
Also Read: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!
అడవి జంతువుల నిపుణలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏనుగులను చంపి వాటి దంతాలను చట్టవ్యతిరేకంగా విక్రయించే అడవి వేటగాళ్లు చెలరేగిపోతారని.. ప్రజలు వన్యమృగాల మాంసానికి అలవాటు పడిపోతారని హెచ్చరిస్తున్నారు.