BigTV English

America releases weapon don : వెపన్ డాన్ రిలీజ్.. ప్రపంచమంతా అలర్ట్..

America releases weapon don : వెపన్ డాన్ రిలీజ్.. ప్రపంచమంతా అలర్ట్..

America releases weapon don : అతనో డాన్. డాన్ అంటే సాదాసీదా డాన్ కాదు. పెద్ద పెద్ద దేశాల్నే గడగడలాడించిన డాన్. అమెరికా జైల్లో మగ్గిపోతున్న అతడికి… ఉన్నట్టుండి స్వేచ్ఛ లభించింది. అది కూడా… ఓ డీల్‌లో భాగంగా. ఇంతకీ అమెరికా అతణ్ని ఎందుకు విడుదల చేసింది. దీని వెనుక అసలు ఏం జరిగింది?


అమెరికా జైలు నుంచి బయటపడ్డ ఆ డాన్ పేరు… విక్టర్ బౌట్. ప్రపంచ దేశాల్లో అతడికి ఉన్న ముద్దు పేరు… ”మృత్యు వ్యాపారి”. రష్యాకు చెందిన విక్టర్ బౌట్ ఓ ఆయుధ వ్యాపారి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలకు ఆయుధాలు సరఫరా చేసేవాడు. అది కూడా సొంత విమానాల్లో. రష్యా గట్టి మద్దతు ఉన్న అతనికి… ఆప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, ఇరాక్‌, సూడాన్‌, అంగోలా, కాంగో, లైబీరియా, ఫిలిప్పీన్స్‌, రువాండా, సియెర్రాలియోన్ దేశాల్లో బలమైన నెట్ వర్క్ ఉంది. యాంటినోవ్‌, ఇల్యూషన్‌, యకోవ్‌లెవ్‌ రకం కార్గో విమానాల్లో ఆయా దేశాలకు ఆయుధాలు సరఫరా చేసేవాడు… విక్టర్ బౌట్. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఉగ్రవాద దాడులు జరిగే వరకు… అతని వ్యాపారం యథేచ్ఛగా సాగింది. ఆ తర్వాతే అతణ్ని పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది… అమెరికా.

తన దగ్గురున్న విమానాల ద్వారా యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, టన్నుల కొద్దీ ఆయుధాల్ని ప్రపంచంలోని ఏ మూలకైనా విక్టర్ బౌట్ సరఫరా చేస్తాడని 2005లో అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రెజరీ కీలక నివేదిక ఇచ్చింది. దాంతో… ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన బౌట్ ను కట్టడి చేస్తూ వచ్చింది… అమెరికా. 2006లో అతని 30 డొల్ల కంపెనీల్లో 12 సంస్థల ఆస్తులను స్తంభింపజేసింది. అమెరికన్లతో అతను లావాదేవీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. కానీ, అతనికున్న పలుకుబడి కారణంగా అరెస్ట్ మాత్రం చేయలేకపోయింది. అయితే 2008లో అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వేసిన ఉచ్చులో విక్టర్ పడ్డాడు. అమెరికా అధికారులు కొలంబియాకు చెందిన ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌ రూపంలో అతని దగ్గర ఆయుధాలు కొనేందుకు థాయిలాండ్ వెళ్లారు. కొలంబియాలోని అమెరికా హెలికాప్టర్లను కూల్చేసే ఆయుధాలు ఇచ్చేందుకు విక్టర్ బౌట్ కూడా అంగీకరించాడు. దాంతో అతడిని అరెస్టు చేసి… రెండేళ్ల తర్వాత 2010లో అమెరికాకు తరలించారు. 2012లో విక్టర్ కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎఫ్‌ఏఆర్‌సీ రెబల్స్‌కు వందల కొద్దీ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిసైల్స్‌ను, 20 వేల ఏకే 47లను అమ్మేందుకు ఒప్పుకున్నందుకు ఈ శిక్ష విధించారు. దాంతో… పదేళ్లుగా అమెరికా జైల్లోనే ఉన్నాడు… విక్టర్ బౌట్.


ప్రపంచానికే ప్రమాదకరమైన విక్టర్ బౌట్ ను… ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోసం జైలు నుంచి విడుదల చేసింది… అమెరికా. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై రష్యా జైల్లో ఉన్న అమెరికన్‌ విమెన్స్‌ నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ బ్రిట్నీగ్రినెర్‌ ను విడిపించుకోవడానికి విక్టర్ బౌట్ ను రష్యాకు అప్పగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాస్కో ఎయిర్ పోర్టులో గంజాయి తైలంతో బ్రిట్నీ పట్టుబడటంతో… రష్యా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. విక్టర్ ను జైలు నుంచి విడుదల చేస్తేనే ఆమెను కూడా జైలు నుంచి రిలీజ్ చేస్తామని రష్యా కండీషన్ పెట్టింది. దాంతో రష్యా ఒత్తిడికి తలొగ్గిన అమెరికా… అబుదాబిలో ఇదర్నీ ఎక్స్ఛేంచ్ చేసుకునేలా ప్లాన్ చేసింది. వాషింగ్టన్‌ నుంచి ఓ ప్రైవేట్ విమానంలో బౌట్‌ను అబుదాబి తీసుకొచ్చారు… అమెరికా అధికారులు. మాస్కో నుంచి మరో ప్రైవేట్‌ జెట్‌ బ్రిట్నీ గ్రినెర్‌ను తీసుకుని అక్కడ ల్యాండ్ అయింది. విమానాశ్రయంలోనే ఇద్దరినీ పరస్పరం మార్చుకున్నారు… అధికారులు. ఈ డీల్‌కు మధ్యవర్తులుగా సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ వ్యవహరించారని… ఆయా దేశాల విదేశాంగ విభాగాలు వెల్లడించాయి. విక్టర్ బౌట్ జీవిత కథ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. అందుకే అతడి అక్రమ ఆయుధ వ్యాపారంపై హాలీవుడ్ హీరో నికోలస్‌ కేజ్‌తో ”లార్డ్‌ ఆఫ్‌ వార్‌” చిత్రాన్ని నిర్మించారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×