Anxiety Gene:- మనుషుల్లో డిప్రెషన్, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎక్కువయపోతున్నాయి. వీటికి పలు కారణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నా.. ప్రత్యేకంగా ఏంటీ కారణం అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే మానసిక సమస్యలకు మూలం ముందు శారీరికంగా ప్రారంభమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా మనుషుల్లో ఆందోళనను కలిగించడం కోసం శరీరంలో ప్రత్యేకంగా జీన్ ఉంటుందని బయటపెట్టారు.
మనిషి శరీరంలో ఆందోళనకు సంబంధించిన జీన్‌ను గుర్తించడం మాత్రమే కాదు.. దానిని ట్రీట్ చేసే విధానాన్ని కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆందోళనకు సంబంధించిన సమస్యలకు దీర్ఘకాల పరిష్కారం ఇవ్వడానికి ఈ జీన్ అనేది ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఆందోళనతో బాధపడుతున్నారు. వారి ఆందోళనను తగ్గించడం కోసం వైద్యులు డ్రగ్స్‌ను అందిస్తున్నారు. కానీ అవి ఎంతవరకు మెరుగ్గా పనిచేస్తాయి, ఆందోళనను పూర్తిగా నయం చేయడానికి ఎలాంటి డ్రగ్స్ ఉపయోగిస్తే మంచిది అనే విషయాలు ఇప్పటికీ పూర్తిగా తెలియదు.
అసలు ఆందోళన ఉన్నవారి మెదడు ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఆరు నెలలు ఒక ఎలుకపై పరిశోధనలు చేశారు. ముందుగా ఎలుకకు ఆందోళన కలిగించేలాగా మందులు ఇచ్చి, ఆ తర్వాత దాని బ్రెయిన్ యాక్టివిటీని పరిశీలించారు. వారు మెదడులోని అయిదు మైక్రోఆర్ఎన్ఏలు (ఎమ్ఐఆర్ఎన్ఏ)లు ఆందోళనకు ముఖ్య కారణమని కనిపెట్టారు. వాటినే ఆమిగ్డాలా అంటారని తెలిపారు. ఈ అయిదు మాలిక్యూల్స్‌లోని ఒకటైన ఎమ్ఐఆర్ 483 5 పీ అనే మాలిక్యూల్ ఆందోళన నుండి ఉపశమనం ఇస్తుందని గుర్తించారు.
వారు కనిపెట్టిన యాంటీ ఆంగ్జైటీ మాలిక్యూల్ ద్వారా ఆందోళనకు తగిన చికిత్సను కనిపెట్టవచ్చని, థెరపీలు కూడా ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆంగ్జైటీ జీన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆందోళన విషయంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని నిపుణులు చెప్తున్నారు. ఇదే కోణంలో మరికొన్ని పరీక్షలు చేస్తూ ముందుకు వెళ్తే ఆందోళనకు సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనుషులలో కలిగే ఆందోళన విషయంలో ఈ జీన్ ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.