CM Chandrababu: ఏపీలో ఇక అక్రమాలకు పాల్పడిన వారికి చుక్కలేనని చెప్పవచ్చు. భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిని సహించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. సమస్యలపై స్థానికులు వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేసినట్లు సీఎం అన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ఫిర్యాదులను ఆన్‍లైన్‍లో నమోదు చేసి, సమస్యలు పరిష్కరించి ఆన్‍లైన్‍లో పొందుపర్చేలా ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు.
అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూసమస్యలు కోకొల్లలు ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే, భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సీఎం అన్నారు. అలాగే అసైన్డ్ భూముల అక్రమాలు అధికంగా జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు, వాటిని తేల్చేందుకు తాము ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామన్నారు. ప్రజల సమస్యలను ఏవిధంగా పరిష్కారం చేయాలో, త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టెక్నాలజీ సాయంతో కూడ భూ సమస్య ఒక్కటి లేకుండ చేస్తామన్నారు.
త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆకస్మిక తనిఖీలకు వస్తున్నట్లు, ఏ జిల్లాలో పర్యటన సాగుతుందో, ఆ జిల్లా పరిపాలన ఏవిధంగా సాగుతుందో నిశితంగా పరిశీలిస్తానని సీఎం తెలిపారు. కుప్పం సోలార్ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడతామని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా కుప్పంను ఎంపిక చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలు కూడ ఆలోచించాలని, ఏ నాయకుడు పరిపాలన సాగిస్తున్నారో గమనించాలని సీఎం కోరారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రయోగం చేశారని, ఆ ప్రయోగం వికటించిందన్నారు.
ఐదేళ్లు అరాచక పాలన సాగిందని, ఇష్టారీతిన కేసులు నమోదు చేసి అందరినీ ఇబ్బందులకు గురి చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా నమోదు చేసిన కేసులను తొలగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ లపై కూడ కేసులు నమోదయ్యాయని, వాటిని కూడ పరిశీలిస్తామని కూడ సీఎం మీడియా ముఖంగా ప్రకటించారు.
Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. వారి ఖాతాల్లో ఏకంగా లక్షల్లో నగదు జమ
తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, అలాగే సీఎం హోదాలో కూడ ఉన్న విషయాన్ని పార్టీ క్యాడర్ గమనించాలన్నారు. ఏ అధికారి తప్పు చేసినా, ఏ కార్యకర్త తప్పు చేసినా తనదే భాద్యత అవుతుందని ఈ విషయాన్ని గమనించాలని సీఎం కోరారు. అందరికీ న్యాయం చేయడమే సీఎంగా తన భాద్యతగా చంద్రబాబు పేర్కొన్నారు. అరాచక పాలనకు పరాకాష్ట వైసీపీ పాలన అంటూ చెప్పిన సీఎం, భూముల అక్రమార్కులను మాత్రం వదిలేది లేదని చెప్పారు.