Parliament Sessions : దేశ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు జరిగిన అవమానం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే ప్రశ్నలకు సమాధానాలు కరవైయ్యాయి. అంబేద్కర్ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తీవ్రంగా పరిగణించి ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. బీజేపీ ఉలిక్కిపడింది. రాహుల్ గాంధీ విమర్శలు, జాతీయాధ్యక్షుడు ఖర్గే సవాళ్లను బదులు చెప్పకుండా.. డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసింది. ఇందుకోసం ఏకంగా.. దేశ పార్లమెంట్ నే వేదికగా చేసుకోవడంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శల దగ్గర మొదలై.. క్రమంగా సభ్యులు ఒకరినొకరు నెట్టుకునే వరకు వచ్చింది. దాంతో.. అసలు అంకాన్ని ప్రారంభించిన బీజేపీ.. ఏకంగా రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇంతకీ.. పార్లమెంట్ లో ఏం జరిగింది. అంబేద్కర్ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఆడిన మాస్టర్ గేమ్ ఏంటి. కాంగ్రెస్ నేతలపై దాడులకు సమాధానాలేంటి…
బీజేపీ సెల్ప్ గోల్.. కాంగ్రెస్ చేతికి చిక్కింది ఇలా
ఇటీవల దేశ పార్లమెంట్ లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అదానీ వ్యవహారాన్ని లేవనెత్తారు. దేశ సంపదను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అదానీ అవినీతి విషయాలపై జాతీయ దర్యాప్తునకు ఆదేశించాలని కోరాడు. ప్రభుత్వ ప్రాజెక్టులను పొందడానికి ఏకంగా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు, కీలక నాయకులకు లంచాలు ఇచ్చారంటూ ఏకంగా అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపిస్తూ.. ఆ దేశంలో కేసు నమోదును ప్రస్తావిస్తూ.. భారత్ లోనూ విచారణ జరపాలని కోరాడు. ఈ విషయంలో బీజేపీ స్తబ్దుగా ఉండిపోయింది. దాని మిత్రపక్షాల నుంచి కూడా ఎలాంటి స్పందనలు లేకుండా జాగ్రత్తపడింది. రాహుల్ గాంధీ ఎంత డిమాండ్ చేసినా.. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలు ఏ తీరుగా నిరసన తెలిపినా.. బీజేపీ మాత్రం ఉలకలేదు పలకలేదు. దీంతో.. అదానీతో కుమ్మక్కు రాజకీయాలు నిజమేనంటూ కాంగ్రెస్ మరింత రాద్దాంతం మొదలుపెట్టింది. దీంతో.. ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికల సమయం నుంచి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నట్లుగా అదానీ, బీజేపీ దోస్తులన్న సంగతి మరింత స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. దాంతో.. బీజేపీ ప్రధాన నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆగ్రహం తన్నుకొచ్చింది. మన రాజ్యంగాన్ని(indian constitution) ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన చర్చలో నోరు జారాడు. ఈ సారి ఏకంగా.. బీఆర్ అంబేద్కర్(br ambedkar) పేరుతో విమర్శలు చేశాడు. దాంతో.. కాంగ్రెస్ మరోసారి ఆందోళనలు దిగింది. ఈసారి ఏకంగా అంబేద్కర్ నే విమర్శించారని, దేశ రాజ్యాంగా – అంబేద్కర్ మీద గౌరవం లేదంటూ ఆరోపణలు గుప్పించింది. ఏకంగా.. హోం మంత్రి రాజీనామా(home minister resigned) చేయాలంటూ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ నుంచి అనుకోని ఈ ఎదురుదాడితో బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచనల్లో పడిపోయింది. కాంగ్రెస్ విమర్శలకు బదులు చెబితే మరింత చిక్కుల్లో చిక్కుకుంటామనే ఆలోచనల్లో మునిగిపోయింది. అమిత్ షా ను కాపాడేందుకు రంగంలోకి దిగిన ప్రధాని మోదీ(PM Modi).. సామాజిక మాధ్యమాల్లో(Social media) మద్ధతు ప్రకటించి అంబేద్కర్ అభిమానులకు మరింత కాక రేపారు. ఇలా.. ఒకదాని తర్వాత మరోక వివాదాలతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం.. సమస్యను పక్క దోవ పట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలే ప్రారంభించింది. కానీ.. ఎలా చేయాలో తెలియని స్థితిలో దేశ పార్లమెంట్ నే(Parlament) వేదికగా చేసుకుని సరికొత్త నాటకానికి తేరలేపింది.
అసలు ఏం జరిగింది
పార్లమెంట్ సమావేశాల(parliament session) కోసం సభకు చేరుకుంటున్న కాంగ్రెస్ ఎంపీ లను ప్రవేశ ద్వారా దగ్గర బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ప్లకార్డులు, నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులకు అడ్డుతగిలారు. దీంతో.. కాంగ్రెస్ సైతం నిరసనలకు దిగింది. అదానీ వ్యవహారంలో పార్లమెంట్ కమిటీ దర్యాప్తుతో పాటు అంబేద్కర్ పై చేసిన విమర్శలకు సమాధానాలు చెప్పాలంటూ నినాదాలు చేసింది. ఈ క్రమంలోనే సభలోకి వెళుతున్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే( Mallikarjun Kharge), అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) లను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీల మధ్య తోపులాట జరగడంతో.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కిందపడిపోయారు.
పార్లమెంటులో ఆందోళనల సందర్భంగా బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు.. ప్రతాప్ సారంగి (Pratap Chandra Sarangi), ముఖేష్ రాజ్ పుత్ లు(Mukesh Rajput) గాయపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మల్లిఖార్జున ఖర్గే సైతం కిందపడ్డారు. దీంతో.. బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపింది. గాయపడిన ఎంపీలను హుటాహుటిన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో(Ram Manohar Lohia Hospital) చేర్పించింది. వారిరువురిని ఐసీయూ లో చేర్చినట్లు వైద్యులు ప్రకటించగా.. అక్కడి నుంచి బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ ను(diversion politics) ప్రారంభించింది. తన ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దాడి చేశారు అంటూ ఆరోపించింది. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిపై దాడి చేశారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. అంబేద్కర్, అదానీ వ్యవహారం విజయవంతంగా పక్కకు పోయిందని బీజేపీ ఆనందపడిపోతుంది.
కాంగ్రెస్ నాయకులు ఏం అంటున్నారు
బీజేపీ ఆరోపణల్ని ఖండించిన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాహుల్ గాంధీతో పాటుగా మీడియా సమావేశం నిర్వహించారు. తాము పార్లమెంటులోకి ప్రవేశించేందుకు వెళుతుంటే బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈక్రమంలోనే తనతో పాటు తమ పార్టీ అధ్యక్షుడిని కూడా తోసేశారని చెప్పారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గేకు గాయాలయ్యాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఇటీవలే మోకాలి శస్త్ర చికిత్స జరిగిన ఖర్గే (mallikarjun kharge) కిందపడిపోవడంతో.. మోకాలి గాయాలయ్యాయని వెల్లడించారు.
తాను దాడి చేశానని చెబుతున్న బీజేపీ పార్లమెంట్ దగ్గర ఉండే సీసీ కెమెరాలను పరిశీలించవచ్చని సూచించారు. పార్లమెంటులోకి ప్రవేశిస్తుంటే.. బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, తనని నెట్టడానికి, బెదిరించడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ ఆరోపిచారు. కానీ.. వారి బెదిరింపులకు తనను ఏం చేయలేవని అన్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్లే హక్కు తనకుందని..తనను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
Also Read : ప్రధాని మోడీ ఆఫీసులో రాహుల్, ఖర్గే.. కీలక సమావేశం
కాగా.. ఇదే వ్యవహారంలో బీజేపీ ఎంపీలు అడ్డుకోవడం, మీదకు రావడం సహా తమపై భౌతిక దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో తన మోకాళ్లకు గాయమైన సంగతినీ ప్రస్తావించారు.