Cyber Fraud: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అలాంటి వారికి ఊహించని కష్టం వచ్చింది. కొడుకు చికిత్స కోసం దాచుకున్న డబ్బులను కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఏలూరు జిల్లా రామన్నగూడెం నుంచి భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటకు వలస వచ్చారు రొక్కం రాజేష్, ప్రశాంతి దంపతులు. వాళ్ల కొడుకు రిత్విక్‌ని DMD అనే కండరాల క్షీణత వ్యాధి దాడి చేసింది. ట్రీట్మెంట్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ, పూర్తిగా నయం కావాలంటే 26 కోట్ల రూపాయలు అవసరమని డాక్టర్లు చెప్పారు. రోజువారీ కూలీలకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మా కొడుకుకి ప్రాణ బిక్ష పెట్టండని సోషల్ మీడియాలో దాతల కోసం పోస్టు పెట్టారు బాధిత తల్లిదండ్రులు. ఆ ఒక్క పోస్ట్‌నే సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకున్నారు.
రూ. 25 వేలు కాజేసిన సైబర్ క్రిమినల్స్!
రిత్విక్ ట్రీట్మెంట్ కోసం 25 లక్షల రూపాయలు సాయం చేస్తామని కొందరు కేటుగాళ్లు.. బాధిత కుటుంబానికి కాల్ చేశారు. ప్రాసెసింగ్ ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ అని నమ్మించి బాధితుల నుంచి 25 వేల రూపాయలు తీసుకున్నారు. అదే రోజు రాత్రి మరొకరు కాల్ చేసి 50 వేలు క్రెడిట్ చేస్తే 10 లక్షలు సాయం చేస్తామని చెప్పారు. కొడుకు ఆరోగ్యంపై ఆవేదనలో ఉన్న పిచ్చి తల్లిదండ్రులకు ఈ మోసాలు అర్థం కాలేదు. డబ్బు క్రెడిట్ చేసిన తర్వాత కాల్ చేస్తే నెంబర్ బ్లాక్ చేశారు. మోసపోయారని అప్పుడు తెలిసింది.
నిందితులకు కఠినంగా శిక్షించాలి..
రిత్విక్ ట్రీట్మెంట్ కోసం ఇల్లు వాకిలి అమ్ముకున్నారు.. బంగారం తాకట్టు పెట్టారు. దొరికిన దగ్గర అప్పు చేశారు. అయినా.. వారి ధైర్యాన్ని కోల్పోలేదు. కానీ, వారి బాధలు, వ్యాధుల పై కూడా కొందరు వెధవలు పేలాలు ఏరుకున్నారని గుర్తు చేసుకుంటే.. బాధిత కుటుంబానికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దుండగులు హర్షసాయి, సంధ్యా ఫౌండేషన్స్ నుంచి కాల్ చేస్తున్నామని బాధితులను నమ్మించారు. తమను మోసం చేసినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు రిత్విక్ పేరెంట్స్. దీంతో పాటు కొడుకుని ట్రీట్మెంట్ కోసం సాయం చేయాలని కోరుతున్నారు.
Also Read: జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!