Diwali in the Sky: దీపావళి అనగానే దీపాలు, టపాసులు, కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే సంబరాలు గుర్తుకొస్తాయి. అయితే, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దీపావళిని ప్రత్యేకంగా జరుపుకోవచ్చని నిరూపించారు ఓ పైలట్. ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఆయన చేసిన ఓ చిన్నపని ప్రయాణికుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
దీపావళి సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్న వారికి పైలట్ ప్రదీప్ కృష్ణన్ ఓ మర్చిపోలేని ఎక్స్ పీరియెన్స్ అందించారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, ప్రయాణికులందరినీ తమ మొబైల్ ఫోన్లు బయటకు తీయాలని కోరారు. అంతేకాదు, ఫోన్లలోని ఫ్లాష్‌లైట్లను ఆన్ చేయాలన్నారు. దీంతో ప్రయాణికులంతా ఆయన చెప్పినట్లుగానే తమ ఫోన్ టార్చ్ లను వెలిగించారు. ఒక్కసారిగా విమానం క్యాబిన్ మొత్తం చిన్నచిన్న దీపాలతో వెలిగిపోయింది. విమానంలోనే దీపావళి జరుపుకుంటున్న అనుభూతి ప్రయాణికులకు కలిగింది. సాధారణ విమాన ప్రయాణాన్ని ఓ అద్భుతమైన జ్ఞాపకంగా మార్చిన పైలట్ ప్రయత్నానికి అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ అందమైన క్షణాలను పైలట్ ప్రదీప్ కృష్ణన్ స్వయంగా షూట్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా మొబైల్ ఫ్లాష్‌లైట్లు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొనడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన ప్రయాణికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, దీపావళి రోజు తినే ప్రతి స్వీట్ అద్భుతమైన ప్రోటీన్‌గా మారాలని సరదాగా కామెంట్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పైలట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విమాన ప్రయాణంలో ఇలాంటి ఎక్స్ పీరియెన్స్ పొందడం చాలా అరుదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు 100కు పైగా విమాన ప్రయాణాలు చేసినప్పటికీ, ఏ కెప్టెన్ కూడా ఇలా ప్రత్యేకంగా ప్రయాణికులతో మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. ఒక్కసారైనా ఇలాంటి అనుభూతిని పొందాలని ఉందన్నాడు.
సాధారణంగా విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు, ప్రకటనలు మాత్రమే వినిపిస్తుంటాయి. కానీ, పండుగ రోజున ప్రయాణికులను కూడా సంబరాల్లో భాగం చేయాలనే పైలట్ ఆలోచన అందరినీ ఆకట్టుకుంది. విమానంలో దీపాలు వెలిగించలేకపోయినా, మొబైల్ ఫోన్ వెలుగులతో దీపావళి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఆనందాన్ని పంచడానికి పెద్ద ఏర్పాట్లు అవసరం లేదని, ఒక చిన్న ఆలోచన చాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అందుకే ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నది.
Read Also: పాస్‌పోర్ట్ లేకుండా నేపాల్, భూటాన్ వెళ్లొచ్చా? కొత్త రూల్స్ వచ్చేశాయ్!