Eat Drink Sleep : ఈ ఫోటో చూశారా! ఎవరో యువతి నేలపై స్పాంజ్ లాంటి దాన్ని వేసుకుని… నిండా దుప్పటి కప్పుకుని నిద్రపోతోంది కదా. ఎంత అలసిపోతే ఉన్న చోటే నిద్ర ముంచుకు వచ్చిందో అనుకుంటున్నారా? మీ అంచనా కరెక్టే. కాకపోకే ఆమె నిద్రపోతోంది ఆఫీసులో. అది కూడా సోషల్ మీడియా దిగ్గజ సంస్థ అయిన ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో. గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు… ఇప్పుడు మస్క్ పుణ్యమా అని చూడాల్సి వస్తోందని కొందరు విమర్శిస్తుంటే… యువతి మాత్రం, యూజర్లకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నాల్లో కొన్ని త్యాగాలు తప్పవంటూ సమాధానమిచ్చింది. చేసే పనిని ప్రేమించాలని, తన జీవితంలో ఇది అత్యుత్తమ సమయం అని ఆ యువతి అనడం చూసి… అంతా అవాక్కవుతున్నారు.
ట్విట్టర్ ను కొన్నాక మస్క్ ఉద్యోగులపై ఒత్తిడి పెంచి అంతులేని పని భారాన్ని మోపారని… వాటిని చేరుకోవడానికి చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులు 24 గంటలూ ఆఫీసులోనే ఉంటూ… అక్కడే తిని, అక్కడే నిద్రపోతున్నారని అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అది నిజమేనని చెప్పే ఒక ఫోటో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విటర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఎస్తర్ క్రాఫోర్డ్ ఆఫీసులోనే నేలపై నిద్రిస్తున్న ఫొటోను ఇవాన్ అనే ఉద్యోగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్విటర్ బాస్ నుంచి ఏదైనా కోరుకుంటే ఇలా ఉండాల్సిందే అని క్యాప్షన్ పెట్టాడు. ట్విట్టర్ ఉద్యోగుల్ని మస్క్ భయపెట్టి పని చేయించుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్న సమయంలో బయటికొచ్చిన ఈ ఫొటో… ఒక్కసారిగా వైరల్ అయింది. కానీ… ఫోటో ఉన్న ఎస్తర్ క్రాఫోర్డ్ మాత్రం సానుకూలంగా స్పందించింది. అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కొన్నిసార్లు ఇలా పనిచేయక తప్పదని చెప్పుకొచ్చింది. దాంతో… ట్విట్టర్లో భయం భయంగా పనిచేసే ఉద్యోగులే కాదు… మస్క్ నిర్ణయాలకు, ఆయన లక్ష్యాలకు తగ్గట్టు పనిచేసే వాళ్లు కూడా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.