Case On KTR : ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే.. ఏసీబీ ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో.. కేటీఆర్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే.. ఔటర్ రింగు రోడ్డు వ్యవహారం, ధరణీ పోర్టల్ లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో వరుసగా కేసుల నమోదుతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఆర్వింద్ కుమార్, ఏ3 గా బీఎల్ఎన్ రెడ్డి పై పేర్కొంది. కార్ రేసింగ్ ఒప్పందంలో నిబంధనల్ని పాటించలేదనే ఆరోపణలతో పాటు ఇష్టారాజ్యంగా నిధుల్ని విడుదల చేశారని ఏసీబీ కేసు నమోదు చేయగా.. దానికి కొనసాగింపుగా ఈడీ రంగంలోకి దిగింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో.. కేటీఆర్ చుట్టూ ఈ కేసు మరింత బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం పేరుతో రూ..55 కోట్లను యూకేకు చెందిన ఎస్ నెక్స్ట్ సంస్థకు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. అలాగే..ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.46 కోట్లను డాలర్లుగా మార్చి రేసింగ్ సంస్థకు అధికారులు పంపించారు. ఇలా పంపించడాన్ని మనీ లాండరింగ్ గా పేర్కొన్న ఈడీ.. ఫేమా నిబంధనలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో.. మాజీ మంత్రి కేటీఆర్ మిగతా వారితో పాటు యూకేకు చెందిన ఎస్ నెక్స్ట్ సంస్థపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.