150 killed in Nepal due to heavy rain, floods: నేపాల్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నేపాల్ విలవిలలాడుతోంది. భారీ వర్షాల కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండు పరిసర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ప్రాణ నష్టం భారీగా సంభవించింది. ఇప్పటివరకు 150 మందికిపైగా మృతి చెందినట్లు నేపాల్ సాయిధ దళాలు వెల్లడించాయి. దాదాపు 100మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
మరోవైపు, రాజధాని ఖట్మండుకు రాకపోకలు నిలిచిపోయాయి. నేపాల్ లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వరదల కారణంగా వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. పదుల సంఖ్యలు వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతోపాటు రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కావ్రే పాలన్ చౌక్ ఏరియాకు చెందిన 34 మంది, లలిత్ పూర్‌నకు చెందిన 20 మంది, దాడింగ్‌కు చెందిన 15 మంది, ఖాట్మండుకు చెందిన 12 మంది, మక్వాన్ పూర్‌కు చెందిన ఏడుగురు, సింధ్ పాల్ చౌక్‌కు చెందిన నలుగురు, డోలఖకు చెందిన ముగ్గురు, పంచ్ తర్, భక్తపూర్ జిల్లాలకు చెందిన ఐదుగురు మృతి చెందారు.
ఇదిలా ఉండగా, దాదాపు 3వేలమంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు నేపాల్ సాయిద దళాలు తెలిపాయి. ఇప్పటివరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ వరదల ప్రభావం బీహార్‌పై పడింది. బీహార్ లో ప్రవహిస్తున్న కొన్ని నదులు నేపాలు నుంచి వస్తున్నాయి. ఆ నదులకు ఆకస్మిక వరదలు రావడంతో బీహార్ లోని పలు ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు.
Also Read: బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..
నేపాల్ లో కుండపోత వర్షాలకు బీహార్‌లోనూ నదులు ఉధృత్తంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వందలాది గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. కోసి, కమల, గండక్, భాగమతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లీకేజీలు ఏర్పడి భారీగా వరద నీరు సమీప గ్రామాల్లోకి చేరుతోంది. ప్రస్తుతం వరద ముప్పు తగ్గేలా లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.