EU Support Kyiv : ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఉక్రెయిన్ కు మద్ధతు ప్రకటించేందుకు ఐరోపా దేశాల నాయకులంతా కీవ్ చేరుకున్నారు. ఇన్నాళ్లు ఉక్రెయిన్ కు మద్ధతుగా నిలిచి, తన ప్రత్యార్థి రష్యాను యుద్ధంలో ఓడించేందుకు ప్రయత్నించిన అమెరికా.. చివరికి ట్రంప్ తీరుతో ఉక్రెయిన్ కు దూరంగా జరగుతోంది. తాజాగా నిర్వహించిన పాశ్చాత్య దేశాధినేతల సమావేశానికి అమెరికా దూరంగా ఉండిపోయింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. ఆ దేశానికి సంబంధించిన వాళ్లెవరూ ఉక్రెయిన్ కు మద్ధతుగా రాలేదని తెలుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద సంఘర్షణ జరుగుతుంది అన్న జెలెన్స్కీ.. కీవ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి యూరోపియన్ నాయకులకు స్వాగతం పలికారు. ఈ ఏడాదైన ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలని కోరుకున్న నేతలు.. మనం బలం, జ్ఞానం, ఐక్యతతో దానిని గెలుచుకోవాలని అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్ ఆచరణాత్మకంగా వ్యవహరించాలన్న ఉక్రెయిన్.. యూరప్ తన సొంత సైన్యాన్ని సృష్టించుకోవాలని సూచించారు.
కీవ్ లో పర్యటించిన ప్రముఖుల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, కెనడా, డెన్మార్క్, ఐస్లాండ్, లాట్వియా, లిథువేనియా, ఫిన్లాండ్, నార్వే, స్పెయిన్, స్వీడన్ నాయకులు ఉన్నారు. బ్రిటన్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, పోలాండ్, స్విట్జర్లాండ్, టర్కీ వంటి ఇతర దేశాల నాయకులు వీడియో కాల్ ద్వారా ప్రసగించారు. ఈ మొత్తం సమావేశంలో అక్కడా అమెరికా అధికారులు కానీ, మధ్యవర్తులు కానీ లేకపోవడం సరికొత్త సందేహాలకు తావిస్తోంది.
ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్ కు మాత్రమే ప్రమాదం లేదని, మొత్తం యూరప్ భద్రతకు ప్రమాదం అని నేతలు అభిప్రాయపడ్డారు. జెలెన్స్కీకి పూర్తి స్థాయి మద్ధతు ప్రకటించిన యూరోపియన్ యూనియన్ నాయకులు.. మిగతా దేశాలు కూడా కైవ్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరికొందరు రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అక్కడ సమావేశమైన నేతల్ని ఉద్దేశించి ప్రసంగించిన డెన్మార్క్ ప్రధాని.. అంతా యూరోపియన్లుగా అభివృద్ధి చెందాలి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలని అన్నారు. యుద్ధంలో గెలిచేందుకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉందని, ఆలోపుగా అనుకున్నది సాధించాలంటూ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి ముందుగా.. యుద్ధంలో మరణించిన ఉక్రేనియన్ సైనికులకు కీవ్ సెంట్రల్ స్క్వేర్‌లోని స్మారక చిహ్నం ముందు సందర్శకులు నివాళులర్పించారు. కాగా.. ఈ సమావేశం మొదలైన కొద్దిసేపటికే.. వైమానిక దాడుల గురించి హెచ్చరించే సైరన్‌లు మోగాయి. దాంతో.. అప్రమత్తమైన రక్షణ దళాలు అవసరమైన చర్యలు చేపట్టారు. కానీ.. ఆ సమయంలో ఎక్కడా ఎలాంటి దాడులు జరగలేదు. మూడేళ్ల యుద్ధంలో ఇరువైపులా భారీగా సైనికులు చనిపోయారు. కానీ.. ఇరువైపులా సైనికుల మరణాలపై ఎలాంటి సంఖ్యా బయటకు రాలేదు.
రెండు రోజుల క్రితం భారీగా డ్రోన్ల దండుతో విరుచుకుపడినా.. ఉక్రెయిన్ కు పెద్దగా నష్టం సంభవించలేదని ఉక్రెయిన వైమానిక దళం తెలిపింది. అదే సందర్భంలో.. రష్యాలోని రియాజాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని తెలిపిన అధికారులు.. శత్రువు చమురు, మౌలిక సదుపాయాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఉక్రెయిన్ కు పెద్దన్నలా సాయం చేస్తూ వచ్చిన యూఎస్.. ఇప్పుడు సాయాన్ని క్రమంగా నిలుదల చేస్తున్న తరుణంలో కైవ్ దళాలు కాస్త ఇబ్బందికర పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నాయి. అయితే.. యూఎస్ మద్దతు తగ్గినా, లేదా పూర్తిగా ఆగిపోయిన పక్షంలో… యూరోపియన్ యూనియన్ దేశాలు ఆ అంతరాన్ని ఎంతవరకు పూరించగలవో రక్షణ రంగ నిపుణులు స్పష్టం చెప్పలేకపోతున్నారు.
Also Read : USAID Employee Fired : మళ్లీ వేసేశాడు!.. యూఎస్ ఎయిడ్ 2వేల మంది ఉద్యోగులను తొలగించిన ట్రంప్
ప్రస్తుత పరిస్థితుల్లో జెలెన్స్కీ యూరప్‌తో సంబంధాలను పెంచుకుంటూనే వాషింగ్టన్‌తో వ్యూహాత్మక సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చైనా, భారత్ వంటి దేశాలతో చేతులు కలపాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వాషింగ్టన్‌తో సంబంధాలు ఇంకా సంక్షోభ స్థాయికి చేరుకోలేదని, ప్రస్తుత స్థితి తిరిగి కుదురుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.