OTT Movie : 2036లో ఒక ఘోరమైన మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఆ తరువాత జర్మనీలో ఉండే ఒక ద్వీపం మానవాళికి చివరి ఆశ్రయం అవుతుంది. అయితే ఈ రాతి ద్వీపంలో వనరులు కొరతగా ఉంటాయి. ఆంతేకాకుండా ఒక క్రూరమైన ర్యాంకింగ్ వ్యవస్థ 513 మంది జీవితాలను నిర్ణయిస్తుంది. ఈ దీవిలో ఒక శిశువు జన్మిస్తే, మరొకరు తమ జీవితాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. చివరికి ఆ మహమ్మారి వైరస్ కి విరుగుడు మందు దొరుకుతుందా ? ఆ దీవిలో మనుషులు ఎలా జీవిస్తారు ? ఈ సిరీస్ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 2036లో ఒక పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచంలో జరుగుతుంది. ఒక ఘోరమైన మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాత, జర్మనీ నార్త్ సీలోని హెల్గోలాండ్ ద్వీపం 513 మంది బతికినవారికి చివరి సురక్షిత నివాసంగా మారుతుంది. ఈ రాతి ద్వీపంలో వనరులు పరిమితం కావడంతో, ఒక టోటలిటేరియన్ సమాజం ఏర్పడుతుంది. ఇందులో కేవలం 513 మంది జనాభా మాత్రమే ఉంటారు. ఈ సంఖ్యను నియంత్రించడానికి ఒక శిశువు జన్మిస్తే, మరొక వ్యక్తి తమ జీవితాన్ని త్యాగం చేయాలి. స్వచ్ఛందంగా ఎవరూ ముందుకు రాకపోతే, ర్యాంకింగ్ జాబితాలో అతి తక్కువ స్కోరు ఉన్న వ్యక్తి బలవుతాడు. ఈ ర్యాంకింగ్ వ్యవస్థలో, అక్కడ ఉన్న మనుషులు ఎంత ఉపయోగకరంగా ఉంటే, అంత ర్యాంకింగ్ ఉంటుంది. వీళ్లందరికన్నా ఈ ద్వీపంలోని ఏకైక వైద్యుడు అయిన మారెక్ మొదటి స్థానం ఉంటాడు. ఇతరులు తమ స్థానం కోసం నిరంతరం పోరాడుతుంటారు.
ద్వీపాన్ని బీట్రైస్ వెస్ట్‌ఫాల్ అనే మహిళ నడిపిస్తుంది. ఆమె కఠినమైన నియమాలను అమలు చేస్తూ ఈ సమాజాన్ని నిర్వహిస్తుంది. ఈ నియమాల వల్ల మనం బతుకుతున్నాం అని నమ్ముతుంది. కానీ ఆమె నాయకత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ద్వీపంలోని యువత మధ్య తిరుగుబాటు భావనలు మొదలవుతాయి. మెయిన్‌ల్యాండ్ నుండి ఒక తిరుగుబాటు గ్రూప్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మారెక్, తన కొడుకు జీవితాన్ని కాపాడేందుకు వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పోరాడుతాడు.చివరికి ఈ ద్వీపంలో మనుషులు ఎటువంటి జీవితం గడుపుతారు ? ఆ మహమ్మారి వైరస్ కి మారెక్ వ్యాక్సిన్ ను కనిపెడతాడా ? భూమి మీద ఈ ఒక్క ద్వీపంలోనే మనుషులు ఉన్నారా ? అనే విషయాలను, ఈ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : నడిరోడ్డుపై ఒంటరి మహిళ… పోలీసుల కోసమని వెళ్ళి సైకో చేతిలో బుక్కయ్యే ఫ్రెండ్స్
ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ పేరు ‘హెల్గోలాండ్ 513’ (Helgoland 513). 2024 లో వచ్చిన ఈ సినిమాకి రాబర్ట్ ష్వెంట్కే దర్శకత్వం వహించారు. ఇందులో ఆలెగ్జాండర్ ఫెహ్లింగ్ (మారెక్), మార్టినా గెడెక్ (బీట్రైస్), తిజాన్ మారీ (డానియెలా) ప్రధాన పాత్రల్లో నటించారు. సీజన్ 1, 7 ఎపిసోడ్ లతో ఓటీటీలోకి వచ్చింది. ప్రతి ఎపిసోడ్ సుమారు 45-60 నిమిషాల రన్ టైమ్ తో నడుస్తోంది. IMDb లో దీనికి 5.6/10 రేటింగ్ ఉంది. ఈ సిరీస్ Amazon Prime Video, Apple TV లలో స్ట్రీమింగ్ అవుతోంది.