Secunderabad –Tirupati Summer Special Trains: వేసవి వచ్చిందంటే చాటు చాలా మంది పిల్లా పాపలతో కలిసి తిరుపతికి వెళ్తారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండకు చేరుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తున్నారు. సికింద్రాబాద్, చర్లపల్లి సహా ఇతర రైల్వే స్టేషన్లు తిరుపతికి వెళ్లే ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా అవసరం అయితే, అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
8 అదనపు రైళ్లను ప్రకటించిన రైల్వే అధికారులు
రద్దీగా ఎక్కువగా ఉండే వేసవిలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే పెరిగిన ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సుమారు 20 రోజులకు పైగా ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
⦿ రైలు నెంబర్ 07257(చర్లపల్లి- తిరుపతి రైలు)
హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రత్యేక రైలు సర్వీసు (నెం. 07257) మే 8 నుంచి మే 29వరకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైలు ప్రతి గురువారం సాయంత్రం 4.30 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుకుంటుంది.
⦿ రైలు నెంబర్ 07258( తిరుపతి -చర్లపల్లి రైలు)
అదే రైలు తిరుగు ప్రయాణంలో(నెం. 07258) తిరుపతి నుంచి చర్లపల్లి వస్తుంది. ప్రతి గురువారం తిరుపతిలో బయల్దేరి, చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. మే 9 నుంచి మే 30 వరకు ఈ రైలు సేవలను అందిస్తుంది.
Read Also: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..
ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయంటే?
ఈ వేసవి ప్రత్యేక రైళ్లు సనత్ నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గీర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట సహా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. తిరుమల శ్రీవారి దర్శానానికి వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటికే వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ కు జూన్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. మొత్తం 36 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సమ్మర్ అంతా ఈ రైళ్లను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.
Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!