ISRO Launches 36 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో ఘనత సాధించింది. బ్రిటన్ అంకుర సంస్థ వన్ వెబ్ అభివృద్ధి చేసిన 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత అర్ధరాత్రి 12:07 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి చేపట్టిన ఎల్.వి.ఎం-3 ప్రయోగం విజయవంతమైందని అర్ధరాత్రి 01:42 గంటలకు ఇస్రో ప్రకటించింది. వీటిని జి.ఎస్.ఎల్.వి.-ఎంకే-3 రాకెట్ కు బదులు అతిబరువైన లాంచ్ వెహికల్ మార్క్ III- ఎల్.వి.ఎం3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది.
రాకెట్ నింగిలోకి ఎగిరిన 37 నిమిషాల తర్వాత… 36 ఉపగ్రహాల్లో నుంచి 16 శాటిలైట్లు సురక్షితంగా విడిపోయాయని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మిగతా 20 ఉపగ్రహాలు ఎప్పుడు విడిపోతాయో చెప్పలేమన్నారు. రాకెట్ భూమికి అవతలివైపు ఉండడం వల్ల ఈ ప్రదేశం నుంచి ఆ 20 ఉపగ్రహాలను చూడలేమన్నారు. అందుకే వీటికి సంబంధించిన డేటా కొంచెం ఆలస్యంగా వస్తుందని చెప్పారు. వన్ వెబ్ కు చెందిన మరో 36 ఉపగ్రహాలను కూడా ఎల్.వి.ఎం3 రాకెట్ ద్వారా పంపించనున్నట్లు ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
ప్రస్తుత మిషన్ సుదీర్ఘమైందని చెప్పాలి. రాకెట్ నింగికి ఎగిసినప్పటి నుంచి భూ కక్ష్యలోకి చేరడానికి 91 నిమిషాలు పట్టింది. వన్ వెబ్ సూచన ప్రకారం ఉపగ్రహాలను 600 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు.
ఈ మిషన్ కు ఎన్నో ప్రత్యేకతలు :
ఈ మిషన్ సక్సెస్ కావడంతో మరో మిషన్ కోసం రెడీ అవుతోంది ఇస్రో. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోషియేషన్ లిమిటెడ్- భారత్ కు చెందిన భారతీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. వీటికి సుదీర్ఘ లక్ష్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి డాటా నష్టం లేకుండా అత్యంత వేగవంతమైన కనెక్టివిటీని ఇవ్వాలనేది వీటి టార్గెట్. అందుకోసం మొత్తం 588 ఉపగ్రహాలను రూపొందించనున్నాయి. ఈ శాటిలైట్లను 12 రింగ్ లలో ప్రవేశ పెడతారు. ఒక్కో రింగ్ లో 49 ఉపగ్రహాలు ఉంటాయి.