Janwada Case: జన్వాడ రేవ్ పార్టీ వ్యవహారం కేటీఆర్ బావమదిరి రాజ్ పాకాల మెడకు చుట్టుకుందనే చెప్పవచ్చు. ఈ క్రమంలో మోకిల పోలీసులు ఆయనకు నోటీసులు చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని, నోటీసులో పేర్కొన్న పోలీసులు, నేడు తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరిన విషయం తెలిసిందే. అలాగే అడ్రస్ ప్రూఫ్‌తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు పోలీసులు. మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే BNS 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నోటీసులను రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో గోడకు అంటించారు. మరోవైపు పోలీసుల నోటీసు నేపథ్యంలో హైకోర్టును రాజ్ ఆశ్రయించారు. పార్టీ వ్యవహారంలో తనను పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
నేటి మద్యాహ్నం లంచ్ మోషన్ లో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, నిబంధనలన ప్రకారం పోలీసులు నడుచుకోవాలని సూచించారు. అలాగే పోలీసుల ముందు రాజ్ పాకాల హాజరయ్యేందుకు రెండు రోజులు గడువు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది ఇలా ఉంటే నిన్న పోలీసుల డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ సమయంలో పాజిటివ్ గా నిర్ధారించిన విజయ్ నేడు విచారణకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల విచారణకు సహకరించిన విజయ్ నేడు పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరు కావాలని నిన్ననే పోలీసులు నోటీసులు అందజేశారు. కానీ విజయ్ మాత్రం నిన్న వీడియో విడుదల చేసి, తాను అక్కడ డ్రగ్స్ తీసుకోలేదని, పోలీసులు ఏవేవో కేసులు నమోదు చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు చేశారు. నేడు మాత్రం ఇప్పటి వరకు పోలీసుల ముందు విచారణకు విజయ్ రాలేదని పోలీసులు తెలుపుతున్నారు.
అంతేకాదు పోలీసుల దాడి సమయంలో విజయ్ తన మొబైల్ దాచేశారని, ఇతరుల మొబైల్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. మొబైల్ లో ఉన్న వివరాలతో డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతో ఫోన్ మాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారట. అంతేకాదు తన భార్య ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వేరే వ్యక్తి నెంబర్ ఇచ్చాడని, విచారణకు విజయ్ సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు. మరి పోలీసులు ఈ కేసులో ఎలా పురోగతి సాధించనున్నారో వేచిచూడాలి.