NASA Completes LOFTID Technology : అంగారక (మార్స్) గ్రహంపై నాసా ప్రయోగాలు కొనసాగిస్తోంది. అక్కడ మానవ నివాసంపై అధ్యయనం చేస్తోంది. మార్స్ పైకి మనుషులను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే మనుషులను తీసుకెళ్లే వ్యోమనౌకలు మార్స్ పై సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ప్రయోగాలు చేపట్టింది. అందుకోసం లోఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్ ఫ్లాటబుల్ డీసెలరేటర్-లోఫ్టిడ్ (LOFTID)ని రూపొందించింది. దీన్ని భూవాతావరణంలో ప్రయోగించి పరీక్షించింది.
అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్ కి చెందిన అట్లాస్ వి రాకెట్ ద్వారా ఓ వాతావరణ ఉపగ్రహంతో కలిసి చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది.
అట్లాస్ వి రాకెట్ మొదట వాతావరణ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ వెంటనే లోఫ్టిడ్ ని భూమివైపు వదిలిపెట్టింది. క్షణాల్లో లోఫ్టిడ్ తిరిగేసిన గొడుగులా విచ్చుకుంది. ఆ వెంటనే గంటకు 20 వేలకుపైగా కిలోమీటర్ల స్పీడును అందుకుని భూమివైపు దూసుకొచ్చింది. భూవాతావరణ ఘర్షణవల్ల దాని వేగం తగ్గుతూ వచ్చింది. భూఉపరితలానికి కొన్నివేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అందులోని పారాచూట్ తెరుచుకుంది. హవాయిలోని హొనొలులు దీవులకు తూర్పున పసిఫిక్ మహా సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది ఇన్ ఫ్లాటిబుల్ హీట్ షీల్డ్. దీన్ని రికవరీ చేసేందుకు కహనా-2 అనే నౌకను పంపించారు. అందులోని సెన్సర్లు రికార్డు చేసిన డేటాను విశ్లేషించనున్నారు నాసా సైంటిస్టులు. ఈ ప్రయోగం వివరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఎందుకంటే భూమితో పోల్చితే అంగారక గ్రహం మీద వాతావరణం పలుచన ఉంటుంది. అంతేకాదు అక్కడి వాతావరణం, ఘర్షణ కూడా తక్కువగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా లోఫ్టిడ్ ను ఎలా తీర్చిదిద్దొచ్చు అని తెలుసుకోడానికి ప్రస్తుత ప్రయోగం ఉపయోగపడనుంది. మార్స్ పై మనుషులను పంపినట్లయితే వ్యోమనౌకలను ఎంత వేగంతో ఎలా ల్యాండ్ చేయాలనేదానిపై సైంటిస్టులు పరిశోధనలు కొనసాగించనున్నారు. ఈ డేటా ఆధారంగా ఇన్ ఫ్లాటిబుల్ హీట్ షీల్డ్ కు ఫైనల్ టచ్ ఇచ్చి అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించనున్నారు. మార్స్ పై కూడా మానవరహిత లోఫ్టిడ్ ప్రయోగం విజయవంతమవుతే… ఆ తర్వాత మానవ సహిత ప్రయోగాలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుందనేది నాసా ఉద్దేశం.