Asthma: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఆస్తమా ఉన్నవారికి ఈ సీజన్ సవాలుగా ఉంటుంది. వాతావరణంలో తేమ పెరగడం, ఫంగస్, అలెర్జీ కారకాలు వృద్ధి చెందడం, చల్లని గాలి వంటివి ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో ఆస్తమాను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఆస్తమాను నియంత్రించడానికి 10 చిట్కాలు:
ఇంటి లోపల తేమను నియంత్రించండి:
వర్షాకాలంలో ఇళ్లలో తేమ పెరుగుతుంది. ఇది ఫంగస్, బూజు వంటివి పెరగడానికి కారణం అవుతుంది. డీహ్యూమిడిఫైయర్లను ఉపయోగించడం లేదా కిటికీలను తెరిచి ఉంచడం ద్వారా తేమను తగ్గించవచ్చు. బాత్రూమ్‌లు, వంటగది వంటి ప్రదేశాలలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
ఫంగస్, బూజును శుభ్రం చేయండి:
గోడలు, బాత్రూమ్‌లు లేదా తేమ ఉన్న ఇతర ప్రాంతాలలో ఫంగస్ లేదా బూజు కనిపించినట్లయితే.. వాటిని వెంటనే శుభ్రం చేయండి. శుభ్రపరిచేటప్పుడు మాస్క్ ధరించండి. అంతే కాకుండా గ్లౌజులు వాడండి.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి:
దుమ్ము పురుగులు తేమతో కూడిన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. నేలలను తరచుగా తుడుస్తూ, దుమ్ము దులపండి. బెడ్ షీట్లు, దిండు కవర్లను వేడి నీటితో తరచుగా ఉతకండి. కార్పెట్లు, భారీ కర్టెన్లను నివారించడం మంచిది.
ఆహారంలో మార్పులు:
చల్లని, పుల్లని ఆహారాలకు దూరంగా ఉండండి. వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోండి. పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి రోగ నిరోధక శక్తిని పెంచి.. శ్వాసకోశ ఆరోగ్యానికి సహాయపడతాయి.
తడి బట్టలను ఇంటి లోపల ఆరవేయకండి:
తడి బట్టలను ఇంటి లోపల ఆరవేయడం వల్ల గదిలో తేమ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది ఆస్తమా ఉన్నవారికి మంచిది కాదు. వీలైనంత వరకు బట్టలను ఆరుబయట ఆరవేయండి.
సకాలంలో మందులు తీసుకోండి:
మీ డాక్టర్ సూచించిన ఆస్తమా మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. ఇన్హేలర్లు, నెబ్యులైజర్‌లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోండి. అకస్మాత్తుగా లక్షణాలు తీవ్రమైతే ఉపయోగించడానికి సిద్ధంగా ఉండండి.
కాలుష్యం నుంచి దూరంగా ఉండండి:
వర్షాకాలంలో వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు.. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు బయటకు వెళ్లడం తగ్గించండి. బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించండి.
వేడి డ్రింక్స్ తీసుకోండి:
సూప్‌లు, హెర్బల్ టీలు, గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు ఉపశమనం పొందుతుంది. అంతే కాకుండా శ్లేష్మం పలుచబడుతుంది.
Also Read: ఈ ఎర్రటి ఫ్రూట్స్ తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వ్యాయామం కొనసాగించండి:
వాతావరణం అనుకూలించినప్పుడు, ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయండి. యోగా, శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమాను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.
లక్షణాలను గమనించండి :
ఆస్తమా లక్షణాలలో ఏమైనా మార్పులు వస్తే లేదా అవి తీవ్రమైతే వెంటనే మీ డాక్టర్‌ను సంప్రదించండి. ఎప్పటికప్పుడు వారి సలహాలు పాటించడం చాలా ముఖ్యం.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా వర్షాకాలంలో ఆస్తమాను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.