Night Shift Workers: ప్రస్తుతం చాలా మంది నైట్ షిప్టులు చేస్తున్నారు. ఐటీ, హెల్త్, ట్రాన్స్ ఫోర్ట్‌తో పాటు అనేక పరిశ్రమలలో రాత్రి వేళల్లో ఉద్యోగులు నిత్యం పనిచేస్తుంటారు. అయితే.. ఈ లైఫ్ స్టైల్ మన శరీర సహజ గడియారం (సర్కాడియన్ రిథమ్)ను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిద్రలేమి, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, ఒత్తిడి వంటివి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నైట్ షిప్ట్ పనిచేసేవారు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:
నైట్ షిఫ్టులో పనిచేసే వారికి నిద్ర అనేది చాలా ముఖ్యం. రాత్రిపూట మేల్కొని ఉండటం వల్ల పగటిపూట నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు పూర్తి విశ్రాంతి లభించకపోవచ్చు. దీనిని అధిగమించడానికి.. షిఫ్టు తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
నిద్రకు అనుకూలమైన వాతావరణం: పగటిపూట నిద్రపోతున్నప్పుడు గదిలో చీకటి ఉండేలా చూసుకోండి. మందపాటి కర్టెన్లు వాడండి. నిశ్శబ్ద వాతావరణం కోసం ఇయర్ ప్లగ్స్ ఉపయోగించవచ్చు.
క్రమబద్ధమైన నిద్ర వేళలు: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరం నిద్రకు అలవాటు పడేలా చేస్తుంది.
నిద్రకు ముందు విశ్రాంతి: నిద్రపోయే ముందు కాఫీ, టీ వంటి కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి. ఫోన్, టీవీ వంటి స్క్రీన్‌లను చూడకుండా ఉండటం మంచిది.
2. సరైన ఆహారపు అలవాట్లు పాటించండి:
రాత్రి షిఫ్టులో పనిచేసేటప్పుడు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా తినడం, వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
చిన్నపాటి భోజనం: షిఫ్టు సమయంలో ఒకేసారి ఎక్కువగా తినకుండా.. చిన్న మొత్తాలలో, తరచుగా తినండి. ఇది జీర్ణక్రియను సులభం చేస్తుంది.
ఆరోగ్యకరమైన స్నాక్స్: పండ్లు, డ్రై ఫ్రూట్స్, పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను మీ వెంట తీసుకెళ్లండి.
నీరు ఎక్కువగా తాగండి: డీహైడ్రేషన్ వల్ల అలసట పెరుగుతుంది. కాబట్టి రోజంతా.. షిఫ్టులో కూడా తగినంత నీరు తాగండి. కెఫీన్, షుగర్ ఉన్న డ్రింక్స్‌కు బదులుగా నీరు తాగండి.
3. రోజూ వ్యాయామం చేయండి:
వ్యాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి షిఫ్టు తర్వాత లేదా ముందు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
సమయం కేటాయించండి: షిఫ్టు ముగిసిన తర్వాత లేదా ప్రారంభించడానికి ముందు వ్యాయామం చేయండి. ఉదాహరణకు, బ్రిస్క్ వాకింగ్ లేదా యోగా. క్రమం తప్పకుండా.. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
Also Read: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !
4. సామాజిక జీవితాన్ని కొనసాగించండి:
రాత్రి షిఫ్టులో పనిచేయడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం కష్టంగా మారవచ్చు. కానీ, ఒంటరితనం, ఒత్తిడిని తగ్గించడానికి సామాజిక సంబంధాలు చాలా అవసరం.
ముఖ్యమైన వారితో సమయం గడపండి: మీ షిఫ్టుకు అనుగుణంగా కుటుంబం, స్నేహితులతో మాట్లాడటానికి లేదా కలవడానికి సమయం కేటాయించండి.
హాబీలు: మీకు ఇష్టమైన హాబీలను కొనసాగించండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
రాత్రి షిఫ్టులో పనిచేసేవారు ఈ సూచనలను పాటిస్తే.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండవచ్చు. ఇది కేవలం మీ పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.