Late Sleep: ప్రస్తుతం మారిన జీవన శైలిలో భాగంగా చాలామందికి రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం ఒక అలవాటుగా మారింది. ఈ అలవాటు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలోని ముఖ్యమైన అవయవాలు తమను తాము శుభ్రం చేసుకుని, మరమ్మత్తు చేసుకుంటాయి. దీన్నే మనం “బయోలాజికల్ క్లాక్” లేదా “సర్కాడియన్ రిథమ్” అంటాం. ఈ సహజ సిద్ధమైన గడియారం ప్రకారం మన శరీరం పని చేస్తుంది. ఇంతకీ రాత్రి 11 గంటల తర్వాత నిద్ర పోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర ఆలస్యమైతే ఏం జరుగుతుంది ?
1. శారీరక ఆరోగ్యంపై ప్రభావం:
రాత్రి 11 గంటల తర్వాత మేల్కొని ఉండటం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా.. ‘మెలటోనిన్’ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా.. కార్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు పెరుగుతాయి.
బరువు పెరగడం: ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీనివల్ల ఎక్కువ ఆహారం తినాలనిపిస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, దానితో బరువు పెరుగుతారు.
వ్యాధి నిరోధక శక్తి తగ్గడం: సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
జీర్ణక్రియ సమస్యలు: ఆలస్యంగా నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం పడి అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
2. మానసిక ఆరోగ్యంపై ప్రభావం:
ఒత్తిడి, ఆందోళన: నిద్ర లేకపోవడం వల్ల మెదడు సరిగ్గా విశ్రాంతి తీసుకోలేదు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, చిరాకు, కోపం వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గడం: నిద్ర మన మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. నిద్ర ఆలస్యం అయితే ఈ లక్షణాలు దెబ్బతింటాయి. ఇది రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంది.
డిప్రెషన్: దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
Also Read: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?
ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని చిట్కాలు:
నిర్దిష్ట సమయానికి నిద్రపోవడం: ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించాలి. ఇది మన బయోలాజికల్ క్లాక్‌ను సరిచేస్తుంది.
స్క్రీన్ టైమ్ తగ్గించడం: నిద్రకు ముందు ఒక గంట ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌లకు దూరంగా ఉండటం మంచిది. వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
కాఫీ, టీ తగ్గించడం: సాయంత్రం వేళల్లో కాఫీ, టీ వంటి కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి.
నిద్రకు ముందు విశ్రాంతి: నిద్రకు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, ధ్యానం చేయడం లేదా పుస్తకం చదవడం వంటివి చేయడం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
మొత్తానికి.. రాత్రి 11 గంటల లోపు నిద్రపోవడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది కేవలం అలసటను దూరం చేయడమే కాదు, మన శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.