Navratri Special Recipes: నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు దుర్గాదేవిని పూజించే పండగ. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం పాటించడం అనేది భాగతీయ సంస్కృతిలో ఒక భాగం.. ఉపవాస సమయంలో మనం తినే ఆహారం శుచిగా అంతే కాకుండా సాత్వికంగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన రోజుల్లో పళ్లు, కొన్ని రకాల కూరగాయలు, నానబెట్టిన చిరుధాన్యాలు, సగ్గుబియ్యం, కొబ్బరి, పాలు, గింజలు వంటివి తీసుకోవడం ఆనవాయితీ. ఈ పవిత్రమైన రోజులకు తగ్గట్టుగా.. ఉండే రుచికరమైన ఐదు రకాల వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి స్పెషల్ రెసిపీస్:
1. సాబుదానా ఖీర్ (సగ్గుబియ్యం పాయసం):
సాబుదానా ఖీర్ నవరాత్రిలో చాలా మంది ఇష్టపడే వంటకం. ఇది రుచితో పాటు శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనిని తయారు చేయడానికి.. నానబెట్టిన సగ్గుబియ్యం, పాలు, పంచదార, యాలకులు, కొన్ని డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం) ఉపయోగిస్తారు. సగ్గుబియ్యం పాలు వేసి ఉడికించి, అందులో పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తారు. ఇది చల్లగా కానీ, వేడిగా కానీ చాలా రుచిగా ఉంటుంది.
2. బక్వీట్ హల్వా :
సాధారణంగా గోధుమ పిండితో చేసే హల్వా కాకుండా.. నవరాత్రిలో సింగారా ఆటా (బక్వీట్ పిండి) ఉపయోగిస్తారు. ఈ పిండిని నవరాత్రి ఉపవాస సమయంలో తినవచ్చు. నెయ్యిలో సింగారా పిండిని వేయించి.. అందులో బెల్లం లేదా పంచదార పాకం పోసి ఉడికిస్తారు. డ్రై ఫ్రూట్స్ వేసి దింపితే చాలా రుచికరమైన హల్వా తయారవుతుంది. ఇది త్వరగా శక్తిని ఇచ్చే వంటకం.
3. ఆలు సబ్జీ (బంగాళదుంపల కర్రీ):
సాత్వికమైన ఆహారంలో భాగంగా నవరాత్రి సమయంలో ఆలూ సబ్జీని ఎక్కువగా చేస్తుంటారు. ఉడికించిన బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా నెయ్యిలో జీలకర్ర వేసి వేయించాలి. అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి ముద్ద కలిపి ఉడికించాలి. దీనిని పరాటాలతో కానీ.. పూరీలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.
Also Read: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !
4. పూరీ (బక్వీట్ పూరీ):
నవరాత్రి ఉపవాసంలో కుట్టు కా ఆటా (బక్వీట్ పిండి)తో పూరీలు తయారు చేస్తారు. ఈ పిండిలో ఉడికించిన బంగాళదుంపలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పూరీలుగా ఒత్తుకుని, వేడి నూనెలో వేయించి తీసుకుంటారు. ఈ పూరీలను ఆలూ కర్రీతో కలిపి తింటే చాలా బాగుంటుంది.
5. పనీర్ టిక్కా:
నవరాత్రి ఉపవాసం చేసేవారికి పనీర్ ఒక మంచి ప్రోటీన్ వనరు. పనీర్ ముక్కలను తీసుకుని దానిపై కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి బాగా మ్యారినేట్ చేయాలి. ఈ ముక్కలను కొద్దిగా నెయ్యి లేదా నూనెతో తవాపై వేయించాలి. ఇలా తయారు చేసిన పనీర్ టిక్కా చాలా రుచిగా.. ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని మధ్యాహ్నం స్నాక్‌గా కానీ, రాత్రి భోజనంలో కానీ తీసుకోవచ్చు.
ఈ వంటకాలు కేవలం రుచికి మాత్రమే కాకుండా.. మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ నవరాత్రి ఈ వంటకాలను ప్రయత్నించి, దేవిని ఆరాధించండి.