Korean Hair Care: కొరియన్ హెయిర్ కేర్ రొటీన్ కొంచెం పొడవుగా అనిపించవచ్చు, కానీ దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీరు బలమైన, మందపాటి మరియు మెరిసే జుట్టును కూడా కోరుకుంటే, ఈ రొటీన్ మీ జీవితాన్ని మార్చగలదు.
అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు విషయంలో కొరియన్ హెయిర్ కేర్ రొటీన్ చాలా ప్రాచుర్యం పొందింది. కేవలం చర్మానికే కాదు.. జుట్టుపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ రొటీన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ 5-స్టెప్ కొరియన్ హెయిర్ రొటీన్ పాటించడం ద్వారా మీరు మెరిసే, పట్టు లాంటి జుట్టును పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ -1: స్కాల్ప్ స్క్రబ్ :
జుట్టు సంరక్షణలో స్కాల్ప్ (తల చర్మం) ఆరోగ్యం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి స్కాల్ప్ స్క్రాబ్‌ని ఉపయోగించాలి. ఇది తల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, చుండ్రును తొలగించి.. హెయిర్ ఫోలికల్స్‌ని శుభ్రపరుస్తుంది. దీంతో జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. స్క్రాబ్‌ని తడి జుట్టుపై అప్లై చేసి.. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
స్టెప్- 2: షాంపూ చేయడం:
స్క్రాబ్ చేసిన తర్వాత.. మీ జుట్టు రకానికి సరిపోయే షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూను నేరుగా జుట్టుకు కాకుండా, ముందుగా నీటిలో కలిపి నురగ వచ్చాక ఉపయోగించడం మంచిది. తల చర్మానికి షాంపూతో మసాజ్ చేసి.. జుట్టు చివర్ల వరకు నురగ వచ్చేలా చూసుకోండి. పూర్తిగా శుభ్రం అయ్యే వరకు గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
స్టెప్- 3: కండిషనర్ :
జుట్టును షాంపూతో శుభ్రం చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించాలి. కండిషనర్‌ను జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు మాత్రమే అప్లై చేయాలి. తల చర్మానికి కండిషనర్ పెట్టడం వల్ల వెంట్రుకల మూలాలు బలహీనపడతాయి. కండిషనర్ అప్లై చేసి 2-3 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. చల్లటి నీరు జుట్టు క్యూటికల్స్‌ను మూసివేసి, జుట్టుకు మెరుపునిస్తుంది.
స్టెప్- 4: హెయిర్ మాస్క్ & ట్రీట్‌మెంట్ :
వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ లేదా ట్రీట్‌మెంట్ చేయడం తప్పనిసరి. ఇది జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. మాస్క్‌ని జుట్టు అంతటా అప్లై చేసి.. తర్వాత 15-20 నిమిషాలు ఉంచి అనంతరం శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డ్రై, డ్యామేజ్ అయిన జుట్టు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.
స్టెప్ 5: హెయిర్ ఎసెన్స్ & సీరమ్ :
జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత, చివరగా హెయిర్ ఎసెన్స్ లేదా సీరమ్‌ని ఉపయోగించాలి. ఇది జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. జుట్టు చివర్లలో అప్లై చేయడం వల్ల చిట్లిన జుట్టు సమస్య తగ్గుతుంది. ఇది జుట్టుకు తేమను అందించి.. మెరుపునిస్తుంది. ఈ సీరమ్‌ను తడి జుట్టుపై కూడా అప్లై చేసుకోవచ్చు.
Also Read: తిన్న వెంటనే స్నానం చేస్తే.. ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం !
ఈ 5 స్టెప్ రొటీన్‌ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా.. అది మరింత అందంగా తయారవుతుంది. ప్రతి స్టెప్‌లో మీ జుట్టు రకానికి సరిపోయే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. వీటి వల్ల మాత్రమే మీరు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అంతే కాకుండా జుట్టు సంబంధిత సమస్యల నుంచి కూడా ఈజీగా బయటపడతారు.