Cough: దగ్గు అనేది శ్వాసనాళంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు శరీరం చూపే సహజమైన ప్రతిస్పందన. ఇది ఇబ్బందికరంగా, చికాకుగా ఉన్నప్పటికీ.. సాధారణంగా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. దగ్గుకు కొన్ని సార్లు ఇంట్లోనే హోం రెమెడీస్ వాడొచ్చు. తేలిక పాటి దగ్గుకు లేదా సాధారణ జలుబుతో వచ్చే దగ్గుకు హోం రెమెడీస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దగ్గు తీవ్రంగా ఉంటే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.
హోం రెమెడీస్:
1. తేనె:
దగ్గుకు అత్యంత పురాతనమైన, ప్రభావవంతమైన నివారణలలో తేనె ఒకటి. తేనె గొంతు నొప్పిని తగ్గించి, దగ్గుకు ఉపశమనం అందిస్తుంది. ఒక టీస్పూన్ తేనెను వెచ్చని నీటిలో లేదా హెర్బల్ టీలో కలుపుకొని కూడా తాగవచ్చు. నిద్రకు ముందు తేనె తీసుకోవడం వల్ల రాత్రిపూట దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల తేనె బ్యాక్టీరియా , వైరస్‌లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
2. ఉప్పునీటి పుక్కిలింత:
గొంతు నొప్పి, దగ్గు తగ్గాలంటే ఉప్పునీటితో పుక్కిలించడం అవసరం. ఇది సాధారణ, సులభమైన నివారణ. గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించడం వల్ల గొంతులోని శ్లేష్మాన్ని తగ్గించి, చికాకు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది గొంతులోని బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
3. ఆవిరి పట్టడం:
వేడి నీటితో ఆవిరి పట్టడం దగ్గు, గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం ఇస్తుంది. వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా విక్స్ వేసి ఆవిరి పట్టడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఆవిరి శ్వాసనాళాలలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పలుచబరిచి, బయటకు రావడానికి సహాయపడుతుంది. ఇది ముక్కు దిబ్బడను కూడా తగ్గిస్తుంది.
4. పసుపు పాలు:
పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల దగ్గు, జలుబు లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
5. అల్లం:
అల్లం దగ్గుకు మరొక అద్భుతమైన హోం రెమెడీ. అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం టీ తయారుచేసి తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదా అల్లం ముక్కలను తేనెతో కలిపి కూడా తినవచ్చు. తాజా అల్లం ముక్కలను నేరుగా నమలడం కూడా గొంతు నొప్పిని తగ్గించగలదు.
6. తులసి:
తులసి ఆకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దగ్గు, జలుబుకు తులసి ఆకులు చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని కూడా తాగొచ్చు. లేదా తులసి ఆకులను నేరుగా కూడా నమలవచ్చు. తులసిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గును తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
7. పుదీనా:
పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది గొంతు నొప్పిని తగ్గించి, దగ్గును అణిచి వేస్తుంది. పుదీనా టీ తాగడం లేదా పుదీనా నూనెను ఛాతీకి రుద్దడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also Read: బీట్ రూట్ జ్యూస్‌తో గుండెకు మేలు.. ఎలాగంటే ?
ముఖ్యమైన చిట్కాలు:
తగినంత డ్రింక్స్ తాగండి. ముఖ్యంగా నీరు, జ్యూసులు, హెర్బల్ టీలు. ఇది గొంతును తేమగా ఉంచి.. శ్లేష్మాన్ని పలుచబరచడంలో సహాయపడుతుంది.
ధూమపానం, కాలుష్యానికి దూరంగా ఉండండి. ఇవి దగ్గును మరింత పెంచుతాయి.
గొంతుకు విశ్రాంతి ఇవ్వండి. అనవసరంగా మాట్లాడకుండా ఉండండి.
గాలిని తేమగా ఉంచడానికి హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించండి.