మన దేశంలో చాలా మంది ఉదయాన్నే ఒక కప్పు టీ తాగుతూ ప్రారంభిస్తారు. టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింక్స్‌లో ఒకటి. కొంతమంది టీ ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. అయితే యునాని వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ ప్రకారం.. మితంగా తాగితే టీ పెద్దగా ఏ హాని ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల టీ తాగడం చాలా మందికి సాధారణంగా సురక్షితమే. టీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కొంతమేర సహాయపడతాయి. అయితే కొన్ని సహజ పదార్థాలను టీలో కలిపితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అల్లం శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వాంతుల వచ్చినట్లు ఫీలింగ్, కడుపు అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. టీలో కొద్దిగా తాజా అల్లం కలిపితే రుచి పెరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
దాల్చిన చెక్క ఒక సువాసనభరితమైన మసాలా దినుసు. ఇది టీకి ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వైద్య నిపుణులు సాధారణంగా సిలోన్ దాల్చిన చెక్కను ఉపయోగించాలని సూచిస్తారు. దీన్ని శ్రీ లంక దాల్చిన చెక్క అని కూడా అంటారు. రోజూ వినియోగానికి మంచి ఎంపికగా భావిస్తారు.
తాజా గ్రీన్ కలర్ లో ఉండే ఇలాయిచీ (యాలకులు) టీకి అద్భుతమైన సువాసనను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. శరీరానికి ఉత్సాహాన్ని అందించడంలో సహకరిస్తాయని చాలామంది నమ్ముతారు. ఒక ఇలాయిచీని కొద్దిగా నూరి టీలో కలపవచ్చు.
ఒక కప్పు టీకి అర టీస్పూన్ తురిమిన అల్లం సరిపోతుంది. పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపవచ్చు. కావాలనుకుంటే ఒక నూరిన ఇలాయిచీని కూడా జోడించవచ్చు.
ముందుగా ఒక పాత్రలో నీరు పోయాలి. అందులో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత పాలు కలపాలి. నెమ్మదిగా మరిగించడం వల్ల మసాలాల రుచి, గుణాలు బాగా బయటకు వస్తాయి.
Also Read: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? సాయంత్రం ఆకలి వేస్తే ఈ ఫుడ్స్ తినడం బెస్ట్
చక్కెర బదులుగా బెల్లం ఉపయోగించడం మంచిది. దీనికంటే మరీ మంచి అలవాటు చక్కెర లేకుండా టీ తాగే అలవాటు చేసుకోవడం. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల టీ సరిపోతుంది. నాలుగు కప్పులకంటే ఎక్కువ తాగకపోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. దీని వల్ల రక్తంలో ఐరన్ వంటి పోషకాల శోషణ తగ్గించే అవకాశం ఉంది.
టీని పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. అల్లం, దాల్చిన చెక్క వంటి సహజ పదార్థాలు కలిపితే టీ మరింత ఆరోగ్యకరంగా మారవచ్చు. అయితే మితంగా తాగడం, సరైన విధంగా తయారు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్యుల సలహా తీసుకోవాలి.