Araku Valley Trip: అరకు వ్యాలీ.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఒక ఫేమస్ హిల్ స్టేషన్. వైజాగ్ నుండి 114 కి.మీ దూరంలో అరకు వ్యాలీ ఉంది. సముద్ర మట్టానికి 900-1300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం.. తూర్పు కనుమల సౌందర్యంతో, పచ్చని అడవులు, కాఫీ తోటలు, జలపాతాలు, గిరిజన సంస్కృతితో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. వైజాగ్ నుండి రైలు, రోడ్డు మార్గాలలో కూడా అరకుకు చేరుకోవచ్చు. రైలు ప్రయాణం 46 టన్నెల్స్ వంతెనలతో అద్భుతమైన అనుభవాన్ని టూరిస్టులకు అందిస్తుంది. మరి అందమైన అరకు వ్యాలీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు:
బొర్రా గుహలు:
అరకు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్న ఈ సున్నపురాయి గుహలు లక్షల సంవత్సరాల చరిత్ర కలిగి, సహజ సౌందర్యంతో చూపరులను ఆకట్టుకుంటాయి. గుహల్లోని స్టాలక్టైట్, స్టాలగ్మైట్ నిర్మాణాలు, లైటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. గుహల చుట్టూ ఉన్న పచ్చదనం ట్రెక్కింగ్‌కు చాలా అనువైనది.
పద్మాపురం బొటానికల్ గార్డెన్:
అరకు లోయలో ఉన్న ఈ గార్డెన్ వివిధ రకాల మొక్కలు, చెట్లతో నిండి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకు కూరగాయల సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఈ తోట, ఇప్పుడు టాయ్ ట్రైన్ రైడ్‌తో పర్యాటకులకు వినోదాన్ని అందిస్తోంది.
అరకు ట్రైబల్ మ్యూజియం:
గిరిజన సంస్కృతి, జీవనశైలిని తెలిపే ఈ మ్యూజియం. స్థానిక గిరిజనుల చేతివృత్తులు, సంప్రదాయాలను తెలుపుతోంది. స్థానిక ఆభరణాలు, వస్త్రాలు, వాడుక వస్తువులు మనం ఇక్కడ చూడవచ్చు.
కాఫీ తోటలు:
అరకు లోయ కాఫీ తోటలకు ప్రసిద్ధి. 1898లో బ్రిటిష్ వారు పరిచయం చేసిన కాఫీ పంట. ఇప్పుడు గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయబడుతోంది. ఈ తోటల్లో ట్రెక్కింగ్ చేస్తూ, కాఫీ గింజల ఉత్పత్తిని కూడా తెలుసుకోవచ్చు.
తారాబు జలపాతం:
అరకు నుండి 14 కి.మీ. దూరంలో ఉన్న ఈ జలపాతం పచ్చని అడవుల మధ్య అద్భుత దృశ్యాన్ని అందిస్తోంది. సాహస ప్రియులకు ఇది ట్రెక్కింగ్, పిక్నిక్‌కు అనువైన ప్రదేశం.
Also Read: వైజాగ్ టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !
అనంతగిరి హిల్స్:
అరకు మార్గంలో ఉన్న ఈ కొండలు, కాఫీ తోటలు, చిన్న జలపాతాలతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ హాట్ బెలూన్ రైడ్, పారా మోటార్ గ్లైడింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా ఉంటాయి.
ప్రయాణ సమాచారం:
అరకు వ్యాలీకి వెళ్లడానికి బెస్ట్ టైం అక్టోబర్ నుండి మార్చి వరకు, ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విశాఖ నుండి రైలులో కిరండూల్ ప్యాసింజర్ ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో బస్సు, క్యాబ్‌ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. గిరి గ్రామదర్శిని, ట్రీహట్స్, గెస్ట్ హౌస్‌లల్లో మీరు ఇక్కడ స్టే చేయవచ్చు.
సలహాలు: సౌకర్యవంతమైన బట్టలు, ట్రెక్కింగ్ షూస్, కెమెరా తీసుకెళ్లండి. స్థానిక గిరిజన ఆహారం, అరకు కాఫీని ఆస్వాదించండి. పర్యాటక స్థలాలను సందర్శించే ముందు స్థానిక గైడ్ సహాయం తీసుకోవడం మంచిది.