Vizag Tour: విశాఖపట్టణాన్ని వైజాగ్ అని కూడా పిలుస్తారు. ఏపీలో సముద్రం వెంబడి ఉన్న అద్భుతమైన నగరాల్లో వైజాగ్ ఒకటి. ఇది సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వం, చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉండటం వల్ల పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. ఈ నగరం బంగాళాఖాతం తీరంలో ఉండి, బీచ్‌లు, కొండలు, ఆలయాలు, ఆధునిక ఆకర్షణల సమ్మేళనాలతో చూపరులను ఆకట్టుకుంటోంది. వైజాగ్‌లో అనేక టూరిస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. వైజాగ్‌లో తప్పక చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వైజాగ్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు:
1. రామకృష్ణ బీచ్ (ఆర్‌కే బీచ్):
వైజాగ్‌లో అత్యంత ప్రసిద్ధమైన బీచ్‌లలో ఒకటైన రామకృష్ణ బీచ్, సముద్ర తీరంలో విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతమైన ప్రదేశం. ఈ బీచ్ సాయంత్రం సమయంలో ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం చాలా మనోహరంగా ఉంటుంది. స్థానిక వంటకాలు, బీచ్ సమీపంలో వాకింగ్ ఈ ప్రదేశాన్నిమరింత ప్రత్యేకంగా చేస్తున్నాయి. ఈ బీచ్ కు దగ్గరగా ఉన్న సబ్‌మెరైన్ మ్యూజియం (ఐఎన్‌ఎస్ కుర్సురా) కూడా తప్పక సందర్శించాలి.
2. కైలాసగిరి:
సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస గిరి ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడి నుండి వైజాగ్ పూర్తి నగరాన్ని చూడొచ్చు. ఇక్కడ ఉన్న శివ-పార్వతుల విగ్రహాలు, పచ్చని ఉద్యానవనాలు, అంతే కాకుండా రోప్‌వే రైడ్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సాయంత్రం సమయంలో ఈ ప్రదేశం చూడటం ద్వారా వైజాగ్ నగరంతో పాటు సముద్ర తీరం యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.
3. సింహాచల ఆలయం:
సింహా చలం కొండలలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒక పురాతన, పవిత్రమైన హిందూ ఆలయం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని ద్రావిడ, ఒడిశా శైలిలో నిర్మించారు. ఇక్కడి వచ్చే భక్తులు, పర్యాటకులు ఈ ఆలయం యొక్క ప్రశాంత వాతావరణం, చుట్టూ ఉన్న పచ్చని కొండలను ఆస్వాదిస్తారు.
4. యారాడ బీచ్:
వైజాగ్‌లోని మరో అందమైన బీచ్ యారాడ బీచ్. ప్రశాంతత, సహజ సౌందర్యంతో ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది రామ కృష్ణ బీచ్ కంటే తక్కువ రద్దీగా ఉంటుంది. ఈ బీచ్‌కు దగ్గరలో ఉన్న డాల్ఫిన్ హిల్ , లైట్ హౌస్ కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు.
Also Read: సముద్రం, కొండలు కలిసే చోటు.. అబ్బబ్బా చూడటానికి రెండు కళ్లు సరిపోవు !
5. అరకు వ్యాలీ:
వైజాగ్ నుండి దాదాపు 120 కి.మీ. దూరంలో ఉన్న అరకు వ్యాలీ ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. పచ్చని అడవులు, కాఫీ తోటలు, బొర్రా గుహలు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బొర్రా గుహలు, సహజ స్టాలగ్మైట్‌లు, స్టాలక్టైట్‌లు, పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.
6. విశాఖ మ్యూజియం:
నగర చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని అనుకునే వారికి విశాఖ మ్యూజియం ఒక గొప్ప ఎంపిక. ఈ మ్యూజియంలో చారిత్రక ఆయుధాలు, నాణాలు, సాంస్కృతిక వస్తువులు ఉంటాయి. వైజాగ్ వెళ్తే మాత్రం మ్యూజియం తప్పకుండా చూడాలి.