రాత్రి నిద్ర ఎంతో ముఖ్యమైనది. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం వంటివి మంచి అలవాట్లు కాదు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం.. ఒకే సమయానికి లేవడం అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం మీరు నిద్రపోతున్న గంటలు గజిబిజిగా ఉంటే అది ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
నిద్ర ఒక ఔషధం
నిజానికి తక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువ సమయం నిద్రపోవడం.. రెండూ కూడా మన శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. ముందస్తు మరణం సమస్యను పెంచేస్తాయి. నిద్ర జీవితంలో ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఒక ఔషధంగా చెప్పుకోవాలి.
ముందస్తు మరణం వస్తుందా?
నిద్ర గురించి ఎప్పటినుంచో ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి. అలాంటి అధ్యయనాల్లో 79 వరకు ఉన్నాయి. ఆ అధ్యయనాల ఫలితాలను పరిశోధకులు ఒకచోట ఉంచి పరిశీలించారు. అందులో క్రమం తప్పకుండా రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే పెద్దలతో పోలిస్తే 8 గంటలు నిద్రపోయే వారికి 14 శాతం ముందస్తు మరణ ప్రమాదం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రతి రాత్రి 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి ముందస్తు మరణ ప్రమాదం 34 శాతానికి పెరిగినట్టు కనిపెట్టారు. ముఖ్యంగా పురుషులకంటే మహిళలు ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల అధికంగా ప్రభావితం అవుతున్నట్టు గుర్తించారు.
శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఆ సమయంలోనే అది తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. కాబట్టి నిద్ర.. శరీరానికి విశ్రాంతినివ్వడం అని స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇది జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, జీవక్రియ, గుండె ఆరోగ్యానికి ఎంతో మద్దతునిస్తుంది. నిద్రను తగ్గిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు దెబ్బతింటాయి. రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. గుండెపై ఒత్తిడి పడుతుంది. అదే అధికంగా నిద్రపోతే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. మతిమరుపు కూడా పెరుగుతుంది. కాబట్టి తక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా నిద్ర పోవడం రెండూ కూడా మనకు కీడే చేస్తాయి.
నిద్ర కారణంగా ముందస్తు మరణాలు రాకుండా ఉండాలంటే.. నిద్రావేళలు పాటించాలి. సెలవు దినాల్లో కూడా ప్రతిరోజు ఈ సమయానికి నిద్రపోతారో అదే సమయానికి నిద్రపోయి.. ఉదయం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవాలి. దీనివల్ల శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ సవ్యంగా పనిచేస్తుంది. రాత్రిపూట మొబైల్ అధికంగా వాడే అలవాటును మానుకోవాలి. అలాగే అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి నిద్రపోవడం వంటివి చేయకూడదు. రాత్రిపూట భారీగా తినడం కాఫీలు తాగడం వంటివి చేయకండి. మీరు ఏది భారీగా తినాలనుకున్న ఉదయం పూట తినండి. రాత్రి భోజనంలో భార్య ఆహారాలు తింటే నిద్ర సరిగా పట్టదు.