బియ్యప్పిండి పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
పచ్చిమిర్చి – మూడు
ఉల్లిపాయలు – రెండు
బియ్యప్పిండి ఉల్లిపాయ పకోడీ రెసిపీ
1. శెనగపిండికి బదులుగా బియ్యప్పిండిని ఈ పకోడీ తయారీ కోసం తీసుకోవాలి.
2. ఒక గిన్నెలో బియ్యప్పిండిని వేసేయాలి.
3. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. ఉల్లిపాయల్లో ఉండే తేమకే ఈ బియ్యప్పిండి ముద్దలా తయారవుతుంది.
5. అలా కాకపోతే కొంచెం నీరు కలుపుకోండి.
6. అందులోనే పచ్చిమిర్చి తరుగును, కొత్తిమీర తరుగును, కరివేపాకు తరుగును కూడా వేసి బాగా కలపండి.
7. అలాగే జీలకర్రను కూడా వేసి బాగా కలపండి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పకోడీ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
9. ఆ నూనెలో పకోడీలను వేసి వేయించుకోండి. ఇవి క్రిస్పీగా ఉంటాయి.
10. అవసరమైతే చిటికెడు వంటసోడాను కలుపుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.
11. ఒకసారి ఈ బియ్యప్పిండి పకోడీ రెసిపీ ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
బియ్యప్పిండితో కూడా మెత్తని పకోడీ, గట్టి పకోడీ రెండు రకాలుగా చేసుకోవచ్చు. పిండిని చాలా గట్టిగా కలిపితే గట్టి పకోడీ తయారవుతుంది. కాస్త పలుచగా కలుపుకుంటే మెత్తని పకోడీ వస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా ఈ పకోడీని వండుకోవచ్చు.
బియ్యప్పిండితో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. అలాగే శారీరక శక్తిని కూడా అందిస్తుంది. గ్లూటెన్ అసహనంతో బాధపడే వారికి బియ్యప్పిండి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే పొట్ట వ్యాధులు ఉన్నవారికి, మలబద్ధకం ఉన్నవారికి కూడా బియ్యపు పిండితో చేసే వంటకాలు ఉపయోగపడతాయి. బియ్యప్పిండి పకోడీ చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. శెనగ పిండి కన్నా బియ్యప్పిండి పకోడీ తింటేనే మంచిది. ఎందుకంటే శెనగపెట్టి కొందరిలో గ్యాస్టిక్ సమస్యలకు కారణం అవుతుంది. కానీ బియ్యప్పిండిలో గ్యాస్ ను ఉత్పత్తి చేసే సమ్మేళనాలు ఉండవు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావు. బియ్యప్పిండి వల్ల బలంగా కూడా ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు బియ్యప్పిండి వంటకాలను చేసుకొని తినేందుకు ప్రయత్నించండి.