Body Aging: మనిషి వయస్సు పెరగడం అంటే సింపుల్‌గా శరీరం బలహీనపడటం, జుట్టు తెల్లబడటం, చర్మం ముడతపడటం అన్నమాటే కాదు. నిజంగా శరీరంలో జరిగే మార్పులు మాత్రం అంత తేలికగా కనిపించవు. వృద్ధాప్యం అనేది ఒక్కసారిగా ఏదో ఒకరోజు ప్రారంభమయ్యేది కాదు… కానీ తాజా శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, మన శరీరంలో వృద్ధాప్యం ఒక్కసారిగా వేగంగా ముందుకు సాగే దశలు ఉంటాయని, ప్రత్యేకంగా 50 ఏళ్ల వయస్సు తర్వాత ఆ మార్పులు గణనీయంగా వేగవంతంగా జరుగుతాయని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం. శరీరంలోని ప్రతి అవయవం ఒకే రీతిలో కాదు, వాటిలో కూడా వేగంగా మాడిపోయే భాగాలుంటాయని ఈ అధ్యయనంలో తేలింది.
చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ అధ్యయనం ప్రపంచ ప్రఖ్యాత జర్నల్ సెల్ లో ప్రచురించబడింది. ఇందులో వారు 76 మంది చనిపోయిన వ్యక్తుల శరీరాల్లోని ముఖ్యమైన అవయవాల నుంచి టిష్యూ నమూనాలు సేకరించారు. ముఖ్యంగా 14 ఏళ్ల నుండి 68 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తుల శరీర భాగాలను పరిశీలించారు. వీరంతా యాక్సిడెంట్స్ కారణంగా బ్రెయిన్ ఇంజురీకి గురై మృతి చెందినవాళ్లు. ఈ నమూనాల ఆధారంగా వారు ఒక కీలక విషయాన్ని గుర్తించారు – వృద్ధాప్యం రేఖారీతిలో జరగదు. అంటే, సమానంగా నెమ్మదిగా ముందుకు సాగదు. వాస్తవానికి, శరీరంలోని కొన్ని భాగాలు మిగతావాటికంటే ముందే సున్నితంగా మారుతుంటాయి. వాటిలో ముఖ్యంగా బ్లడ్ వెస్సల్స్ అంటే రక్తనాళాలు ఎంతో వేగంగా వృద్ధాప్యానికి లోనవుతాయి.
శరీరంలోని హార్మోన్‌ను ఉత్పత్తి చేసే అవయవమైన అడ్రినల్ గ్లాండ్ సుమారు 30 ఏళ్ల వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు చూపించడం మొదలుపెడుతుంది. అలాగే వయస్సు పెరిగే కొద్దీ, 48 రకాల వ్యాధులకు సంబంధించిన ప్రోటీన్ల స్థాయిలు ఈ గ్లాండ్‌లో పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే మన శరీరంలో వృద్ధాప్యం కేవలం కాలంతో పాటు జరగదు, కొంత వయస్సు వచ్చిన దగ్గరనుండి ఇది వేగంగా మడత పడుతుంది. ముఖ్యంగా 45, 50, 55 ఏళ్ల మధ్య పెద్దసంఖ్యలో ప్రోటీన్ల స్థాయిల్లో మార్పులు సంభవిస్తున్నాయని వారు గుర్తించారు. దీన్ని వారు “aging inflection point” అని పిలుస్తున్నారు. అంటే వృద్ధాప్యం అనేది అక్కడివరకు నెమ్మదిగా సాగితే, ఆ తర్వాత ఒక్కసారిగా వేగవంతమవుతుంది.
అందులోనూ ఎక్కువ ప్రభావం చూపిన అవయవం – అఆఒర్టా (Aorta). ఇది మన హృదయం నుంచి రక్తాన్ని శరీరం అంతటా పంపించే పెద్ద రక్తనాళం. ఈ అఆఒర్టాలో కనిపించిన ప్రోటీన్ మార్పులు ఇతర అవయవాలకు కూడా వృద్ధాప్య సంకేతాలు పంపుతున్నాయని, అదే కారణంగా రక్తనాళాలు శరీరాన్ని వృద్ధాప్యం దిశగా నడిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కొత్త సిద్ధాంతమేమీ కాదు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ స్నైడర్ 2023లో చేసిన మరో అధ్యయనంలో కూడా వృద్ధాప్యానికి వేగవంతమైన దశలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా 44 – 60 ఏళ్ల మధ్య ఈ మార్పులు తీవ్రంగా ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు చైనా అధ్యయనం కూడా అదే విషయాన్ని మరో కోణంలో నిర్ధారించింది.
వయస్సు పెరిగే కొద్దీ హార్మోన్లు, మెటబాలిక్ వ్యవస్థలపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇదే మన శరీరంలో పెద్ద మార్పులను కలిగించే ప్రధాన అంశం. మైకేల్ స్నైడర్ వ్యాఖ్యల ప్రకారం, మనం ఒక కారు లాంటివాళ్లం… కొన్ని భాగాలు ముందు మాడిపోతాయి, కొన్ని కాలక్రమానుసారం మాడుతుంటాయి. ఎప్పటికి ఏ భాగాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకుంటే, మానవ ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది. ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే శాస్త్రవేత్తలు ప్రతి అవయవానికి ప్రత్యేకంగా proteomic age clocks రూపొందించారు. అంటే ఒక్కో అవయవంలో వృద్ధాప్యం ఎలా జరుగుతుందో గుర్తించేందుకు ఒక ‘ప్రోటీన్ ఆధారిత టైమ్ మెషిన్’ లాంటి విధానం. ఇది వైద్యశాస్త్రానికి, భవిష్యత్తు ఆరోగ్య పరిశోధనలకు కొత్త దారులు చూపించేలా ఉంది.
ఇంకా మనం వృద్ధాప్యాన్ని సాధారణంగా భావించలేం. ఇది ఒక్క వయస్సుతో సంబంధం కలిగిన ప్రక్రియ కాదు. ఇది ఒక సంక్లిష్టమైన శారీరక ప్రయాణం. మన శరీరంలోని కొన్ని భాగాలు ముందుగానే మాడిపోతుంటే, కొన్ని మిగిలినవాటిని వెంటాడుతుంటాయి. ఈ పరిశోధనలు పూర్తిగా మన ఆరోగ్య విధానాన్ని మార్చివేయగల శక్తి కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన వయస్సును కేవలం కళ్లకు కనిపించే రింక్‌ల ద్వారా కాకుండా, శరీరంలోని ప్రోటీన్ మార్పుల ద్వారా అంచనా వేయబోతున్నారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ అధ్యయనాలు వృద్ధాప్యాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన ఆరోగ్య సంరక్షణకు తొలి అడుగు.