Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో.. అంతే కాకుండా రోగ నిరోదక శక్తిని పెంచడంతో పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇదిలా ఉంటే.. ఏది అతిగా తీసుకున్నా మంచిది కాదు. బీట్‌రూట్ జ్యూస్‌ను ఎక్కువగా తాగినా కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. బీటూరియా: బీట్‌రూట్ జ్యూస్ తాగిన తర్వాత మూత్రం, మలం ఎరుపు లేదా పింక్ రంగులో మారే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా సాధారణమైన విషయం. దీనిని ‘బీటూరియా’ అని అంటారు. ఇందులో ప్రమాదకరమైనదేమీ లేదు. ఇది బీట్‌లో ఉండే సహజ రంగు పదార్ధాల వల్ల జరుగుతుంది. అయితే.. శరీరంలో ఐరన్ లోపం ఎక్కువగా ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
2. కిడ్నీలో రాళ్లు : బీట్‌రూట్‌లో ఆక్సలేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్‌ను తక్కువగా తీసుకోవడం మంచిది.
3. రక్తపోటు విపరీతంగా తగ్గడం: బీట్ రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విశాలంగా చేస్తాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిదే అయినా.. సాధారణ రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే, రక్తపోటు విపరీతంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది . దీని వల్ల తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4. జీర్ణ సమస్యలు : బీట్ రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఫైబర్ మంచిదే అయినా.. ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాల వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, బీట్ రూట్ జ్యూస్‌ను మొదటిసారి తాగేవారు కొద్ది మొత్తంలో ప్రారంభించడం మంచిది.
5. అలెర్జీలు : కొంత మందికి బీట్ రూట్ అలర్జీ ఉంటుంది. దీని వల్ల దద్దుర్లు, దురద, గొంతులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆపేయాలి. లేదంటే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.
Also Read: లైఫ్ స్టైల్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. థైరాయిడ్ సమస్య దూరం !
6. కాలేయ సమస్యలు: బీట్‌రూట్‌లో హెవీ మెటల్స్‌ను తొలగించే గుణం ఉంటుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంపై కొంత ఒత్తిడి పడుతుంది. కాలేయ సమస్యలు ఉన్నవారు దీనిని అధికంగా తీసుకుంటే.. కాలేయంపై భారం పెరుగుతుంది. అందుకే ఎక్కువగా బీట్ రూట్ జ్యూస్ తాగకూడదు.
7. గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగడం: బీట్‌రూట్‌లో సహజమైన చక్కెరలు ఉంటాయి. దీనిని జ్యూస్ రూపంలో తీసుకుంటే.. ఈ చక్కెరలు రక్తంలోకి త్వరగా శోషించబడతాయి. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు దీనిని తీసుకునే ముందు డాక్టర్‌ల సలహా తీసుకోవడం అవసరం.